Soundarya Accident Case : సౌందర్య మరణంపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ
దివంగత సినీనటి సౌందర్య(Actress Soundarya) మరణంపై విచారణ జరిపించాలని ఓ వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాశారు.

దిశ, వెబ్ డెస్క్ : దివంగత సినీనటి సౌందర్య(Actress Soundarya) మరణంపై విచారణ జరిపించాలని ఓ వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాశారు. సౌందర్య మరణం వెనుక ఉన్నది నటుడు మోహన్ బాబు(Mohan Babu) అని, తక్షణమే ఆయనపై చర్యలకు ఆదేశించాలని లేఖలో పేర్కొన్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి గతంలో అనేకసార్లు నటి సౌందర్య మరణంపై పలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె మరణం వెనుక మోహన్ బాబు ఉన్నాడని, ఆమె ఆస్తి లాక్కోవడానికే ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేలా చేశాడని, ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ కు వినతి పత్రం అందించాడు. తాజాగా ఇదే విషయం మీద సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీలకు ఫిర్యాదు లేఖ రాశారు. మంచు మోహన్ బాబుపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని లేఖలో ప్రశ్నించారు.
సౌందర్య మరణంలో మంచు మోహన్ బాబు పాత్ర ఉందని, ఆమె భర్తతో కుమ్మక్కై న్యాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు, హోదా బలంతో ఎందరినో బెదిరించి, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, అయినా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో నిజం తెలియజేయడానికి సోషల్ మీడియా లేదా పత్రికలను అడ్డుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తుంది కానీ, మంచు మోహన్ బాబుకు ఎందుకు వర్తించడం లేదని నిలదీశారు. 21 ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసును తిరిగి విచారించాలని, మంచు మోహన్ బాబుపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో న్యాయం కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని, దశలవారీ ఉద్యమం చేస్తానని ప్రకటించారు. సౌందర్య ఆత్మకు శాంతి చేకూర్చేందుకు, స్త్రీల గౌరవం కోసం ఈ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.