అధ్యాపకుల్లో ఆధిపత్య పోరు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది

Update: 2025-03-21 11:05 GMT
అధ్యాపకుల్లో ఆధిపత్య పోరు
  • whatsapp icon

దిశ, చర్ల: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. తోటి అధ్యాపకులతో కలసిమెలసి విద్యార్థులకు విద్యను బోధించి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులు మీరు ఒకేషనల్ మాది జనరల్ గ్రూప్ అంటూ లెక్కలేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రూపులతో మొదలైన పోరు ప్రస్తుతం మీరా? మేమ?అన్నట్లు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం చర్ల మండలంలో హాట్ టాపిక్ గా మారింది. ఏ నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. ఇదే విషయమై పలువురు విద్యార్థులను కలిసి దిశ ఆరా తీయగా సదరు విద్యార్థులు అనేక విషయాలు చెప్పుకొచ్చారు. తమ పేర్లను మాత్రం బయటికి బహిరంగ పరచడానికి సుముఖత చూపలేదు.

ఇక అసలు విషయానికి వస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల నడుమ గొడవలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నట్లు తెలిసింది! కొంతమంది అధ్యాపకులు ఒక బ్యాచ్ గా ఏర్పడి మీరు వేరు మేము వేరు అంటూ గ్రూప్ రాజకీయాలకు తెరలేపి నట్లు తెలిసింది! ఇక కళాశాల ప్రిన్సిపాల్ సైతం ఒకే వర్గానికి ప్రోత్సహిస్తూ మరో వర్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని మీరు మాట్లాడకూడదని తన ఆదేశాలు ధిక్కరించి మాట్లాడితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సదరు అధ్యాపకులు చేసేదేమీ లేక ప్రిన్సిపాల్ అడుగుజాడల్లో నడుస్తూ లోలోపల కుమిలి పోతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ కారు అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. అధ్యాపాకుల ఆధిపత్య పోరులో భాగంగానే ఈ సంఘటన చోటుచేసుకుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఒకేషనల్ విద్యార్థిని చితకబాదిన అధ్యాపకుడు

జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎమ్ఎల్టీ) రెండవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహిస్తున్న అదే కళాశాలకు చెందిన ఓ అధ్యాపకుడు చితకబాదాడు. కట్ చేస్తే మూడవ రోజు వచ్చి సారీ చెప్పాడు. విషయం తెలుసుకున్న దిశ సదరు విద్యార్థిని ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. తాను పరీక్ష రాస్తున్నానని కనీసం పక్కకు కూడా తల తిప్పి చూడలేదని సార్ వచ్చి చితక బాదినట్లు తెలిపాడు. సార్ ఎందుకు తనను కొడుతున్నాడో అర్థం కాలేదని వాపోయాడు. తమ కళాశాల అధ్యాపకుడు కావడంతో ఎదురు ప్రశ్నించలేదని తెలిపాడు. పరీక్ష ముగిసినాక తన స్నేహితుడు ఇంటికి వెళ్లిన సమయంలో జరిగిన విషయం అతడికి చెప్పుకోని తీవ్ర భావోద్వేగానికి లోనయినట్లు తెలిపాడు.

తన మిత్రుడు వేదన చూడలేని స్నేహితుడు తెలిసిన మీడియా వ్యక్తులకు విషయం చేరవేశాడని, ఈ విషయం కాస్త ప్రిన్సిపాల్ కు చేరడంతో హుటాహుటిన సదరు ప్రిన్సిపాల్ అధ్యాపకుడిని పిలిపించి ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పించినట్లు తెలిపాడు. సదరు అధ్యాపకుడు సైతం కొట్టాల్సింది వేరే వ్యక్తిని అని నిన్ను కాదని ఏదో పొరపాటున జరిగిందని అంటూ వాపోయినట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే సదరు విద్యార్థి ఒకేషనల్ గ్రూప్ కావడంతో జనరల్ గ్రూప్ కు సంబంధించిన సదరు అధ్యాపకుడు చేయి చేసుకున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పోలీసు స్టేషన్ కు సైతం చేరినట్లు తెలుస్తోంది! ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కళాశాలలో జరుగుతున్న గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలకాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపాల్ ఎం.నరేందర్ ను దిశ వివరణ కోరగా కళాశాలలో ఎటువంటి వర్గ విభేదాలు లేవని అధ్యాపకులందరు కలసిమెలసి విధులు నిర్వహిస్తున్నారన్నారు. తనకు అందరూ సమానమేనని ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అనే భేదాభిప్రాయాలు ఏమి లేవని తెలిపారు. ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ అధ్యాపకుడు విద్యార్థి కొట్టిన విషయం నిజమేనని స్కూల్, కళాశాల స్థాయిలో విద్యార్థిని అధ్యాపకుడు మందలించడం సాధారణ విషయమేనని అని బదులిచ్చారు.


Similar News