పండగపూట పస్తులేనా? మూతపడనున్న టెక్స్‌టైల్ పార్క్

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత కొంతకాలంగా సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సరియైన ఉపాధి లేక నేత కార్మికుల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Update: 2024-10-06 04:27 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత కొంతకాలంగా సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సరియైన ఉపాధి లేక నేత కార్మికుల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పెండింగ్ బకాయిలను చెల్లించింది. అయినా నేసిన వస్త్రానికి మార్కెట్లో ధర లేదంటూ సిరిసిల్లలోని టెక్స్‌టైల్ పార్కును మూత వేయడానికి యజమానులు నిర్ణయించుకున్నారు. దాంతో వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ కుటుంబాలు మళ్లీ రోడ్డున పడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర పండగ సమీపిస్తున్న నేపథ్యంలో టెక్స్‌టైల్ పార్క్ మూతపడడంతో దాదాపు 1000 మందికిపైగా కార్మికులు పండగ పూట పస్తులు ఉండే పరిస్థితులు నెలకొంటున్నాయి. దాంతో నేతన్నలు ఆందోళనలతో కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు నేతన్నలను అడ్డుపెట్టుకొని యాజమాన్యులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

బకాయిలు చెల్లించిన ప్రభుత్వం

బతుకమ్మ చీరల పేరిట గత ప్రభుత్వం 270 కోట్లకు పైగా బకాయిలను పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనుకి వచ్చిన నుండి ఇప్పటివరకు దాదాపు 197 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను నేతన్నలకు చెల్లించింది. దాంతోపాటు మరో నాలుగు కోట్ల నిధులను కూడా మంజూరు చేసింది. అంతేకాకుండా ఇప్పటికే స్కూల్ యూనిఫార్మ్స్, పోలీస్ శాఖకు సంబంధించిన బట్ట ఆర్డర్లను సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా మహిళా స్వశక్తి పొదుపు సంఘాలలోని 63 లక్షల మంది మహిళలకు ఏటా రెండు చీరల చొప్పున అందించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దాంతోపాటు విద్యుత్ సబ్సిడీపై కసరత్తు చేస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య కూడా సిరిసిల్లలో పర్యటించి వస్త్ర పరిశ్రమ సమస్యలపై అధ్యయనం చేశారు. దాంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మహాదశ రాబోతుందని పరిశ్రమ వర్గాల్లో హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి.

నేటి నుంచి బందుకు పిలుపు

అదలా ఉండగా జిల్లాలోని తంగేళ్లపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్ లో ఉత్పత్తి అవుతున్న వస్త్రానికి మార్కెట్లో సరియైన గిట్టుబాటు ధర రావడంలేదని, మూడు నెలలుగా ఉత్పత్తి అయిన వస్త్ర నిల్వలు పార్కులో పేరుకుపోయాయని, ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం లేదంటూ నాలుగు రోజుల క్రితం పార్కు అధ్యక్షుడు అనిల్ అధ్యక్షతన వస్త్రోత్పత్తిదారుల సంఘం యజమానులు సమావేశమై నేడు ఆదివారం నుండి టెక్స్టైల్ పార్క్ బందుకు పిలుపునిచ్చారు. దాంతో టెక్స్టైల్ దాని అనుబంధ పరిశ్రమల కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడనున్నారు.

యజమానుల ఇష్టారాజ్యం

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా పెండింగ్ బిల్లులను విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ మరోవైపు నేసిన వస్త్రానికి మార్కెట్లో ధర లేదని యజమానులు టెక్స్టైల్ పార్కును మూసివేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రభుత్వం నుండి వస్తున్న ఆర్డర్లతో యజమానులు లబ్ధి పొందుతూ తమ ఇష్టానుసారంగా ఖర్ఖానాలను మూసివేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నేత కార్మికుల ఆత్మహత్యలను ఆసరా చేసుకుని, యజమానులను కోట్లకు పరిగెడుతున్నారన్న వాదనలు లేకపోలేదు. బతుకమ్మ, దసరా, దీపావళి పండగల నేపథ్యంలో యజమానులు మళ్ళీ టెక్స్టైల్ పార్కు బందుకు పిలుపునివ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

పని చేస్తేనే పైసలు-కూచన శంకర్ టెక్స్టైల్ పార్క్ కార్మికుడు

చాలా కాలం నుండి టెక్స్టైల్ పార్కు పై ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పటికే చాలామంది యజమానులు సంచాలను తూకాలకు అమ్ముకొని వెళ్లిపోయారు. ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న పండగపూట టెక్స్టైల్ పార్క్ మూతపడితే పస్తులుండటమే గతి. పని చేస్తేనే పైసలు వచ్చే బతుకులు మావి. అధికారులు స్పందించి పార్కు మూతపడకుండా ఆపాలి. మూతపడ్డ రోజులకు సైతం వేతనాలు కల్పించాలని కోరుతున్నాం.


Similar News