అటవీ భూములు అన్యాక్రాంతం.. రైతుల ముసుగులో పొలిటికల్ గేమ్..
కబ్జా కోరుల భూదాహానికి విలువైన అటవీ సంపద కరిగిపోతోంది.
కబ్జా కోరుల భూదాహానికి విలువైన అటవీ సంపద కరిగిపోతోంది. రైతుల పేరు చెప్పి సరిహద్దు అటవీ భూములను అక్రమార్కులు ఏథేచ్ఛగా చదును చేస్తున్నారు. ఇటీవల మండలంలోని ఇప్పపల్లి గ్రామంలో రెండు గ్రామాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా వందల సంఖ్యలో చెట్లను నరికి అటవీ భూములను ఆక్రమించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారడంతో పోలీస్ ఫారెస్ట్ అధికారులు విచారణ జరిపారు. ఇది జరిగి నెలలు కూడా కాకముందే తుర్తి గ్రామంలో మరోసారి ఫారెస్ట్ రిజర్వ్ భూముల్లో కబ్జా పర్వం మొదలైంది. స్థానికంగా పలుకుబడి కలిగిన కొంతమంది రాజకీయ నాయకులు రైతుల ముసుగులో కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరైతే గిరిజనుల భూములను కొనుగోలు చేసి వాటిని ఆనుకొని ఉన్న ఫారెస్ట్ భూములను చదును చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇష్టం వచ్చినట్లు అడవులను నరుకుతూ చదును చేసిన భూమిని పట్టా ల్యాండ్‌లో కలిపేసుకుంటున్నారు. ఈ కబ్జాలపై ఫారెస్ట్ అధికారులు లోతుగా దర్యాప్తు జరిపి ఫారెస్ట్ భూములను కాపాడాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
దిశ, కథలాపూర్ : కబ్జా కోరుల భూదాహానికి విలువైన అటవీ సంపద కరిగిపోతోంది. రైతుల పేరు చెప్పి సరిహద్దు అటవీ భూములను అక్రమార్కులు యథేచ్ఛగా చదును చేస్తున్నారు. ఇటీవల మండలంలోని ఇప్పపల్లి గ్రామంలో రెండు గ్రామాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా వందల సంఖ్యలో చెట్లను నరికి అటవీ భూములను ఆక్రమించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారడంతో పోలీస్ ఫారెస్ట్ అధికారులు విచారణ జరిపారు. ఇది జరిగి నెలలు కూడా కాకముందే తుర్తి గ్రామంలో మరోసారి ఫారెస్ట్ రిజర్వ్ భూముల్లో కబ్జా పర్వం మొదలైంది. స్థానికంగా పలుకుబడి కలిగిన కొంతమంది రాజకీయ నాయకులు రైతుల ముసుగులో కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరైతే గిరిజనుల భూములను కొనుగోలు చేసి వాటిని ఆనుకొని ఉన్న ఫారెస్ట్ భూములను చదును చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇష్టం వచ్చినట్లు అడవులను నరుకుతూ చదును చేసిన భూమిని పట్టా ల్యాండ్‌లో కలిపేసుకుంటున్నారు. ఈ కబ్జాలపై ఫారెస్ట్ అధికారులు లోతుగా దర్యాప్తు జరిపి ఫారెస్ట్ భూములను కాపాడాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
అర్ధరాత్రి చెట్ల నరికి ఆపై హద్దులు ఏర్పాటు..
అటవీ భూముల పై కన్నేసిన వ్యక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత చెట్లను నరికి వేస్తున్నారు. జేసీబీలు ట్రాక్టర్ల సహాయంతో భూమిని చదును చేస్తున్నారు. తెల్లారేలోపు ఏకంగా హద్దులు ఏర్పాటు చేసి పట్టా భూముల్లో కలిపేస్తున్నారు. తుర్తి గ్రామంలో జరుగుతున్న ఈ తతంగం పై రాజకీయ ప్రమేయం ఉండడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు స్థానికులు జంకుతున్నారు. కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ వ్యవహారం పై అటవీ శాఖ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. చదును చేసిన ఫారెస్ట్ రిజర్వ్ భూముల్లో గతంలో ఉన్న చెట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న చెట్ల సంఖ్యతో పోల్చితే ఎంత మేర అటవీ సంపద నష్టపోయామో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రశ్నార్ధకంగా వన్యప్రాణుల మనుగడ..
అడవుల ఆక్రమణ కారణంగా అభయారణ్యంలో ఉండే జంతువులకు రక్షణ లేకుండా పోతోంది. దీంతో వన్యప్రాణుల సంరక్షణ చట్టం కేవలం కాగితాలకే పరిమితమైందా అంటే అవుననే అనిపిస్తుంది. వన్యప్రాణుల వేటకు తరిగిపోతున్న అడవులు ఒక కారణమైతే వాటి సంరక్షణ కోసం సరైన నిఘా ఉంచకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. ఇష్టం వచ్చినట్లు అడవులు నరుకుతూ చదును చేసుకుంటూ వెళ్తుండడంతో వన్యప్రాణులు ఆకలి దప్పిక తీర్చుకునేందుకు సమీప గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇదే అదునుగా భావించిన వేటగాళ్లు కాసుల కక్కుర్తిలో పడి జంతువులను విచక్షణా రహితంగా వేటాడుతున్నారు. ఆపై జంతు మాంసాన్ని కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీల వరకు వన్యప్రాణుల మాంసానికి మంచి గిరాకీ ఉండడంతో కొందరైతే ఏకంగా వేటనే జీవనోపాధిగా చేసుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
మా దృష్టికి రాలేదు.. శివ, బీట్ ఆఫీసర్
అటవీ భూములను చదును చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఈ ఘటన పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపడతాం. అటవీ భూములను ఆక్రమించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.