తుమ్మితే ఊడే సీఎం రేవంత్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా అమలు కాలేదని, తుమ్మితే ఊడే సీఎం రేవంత్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎద్దేవా చేశారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా అమలు కాలేదని, తుమ్మితే ఊడే సీఎం రేవంత్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎద్దేవా చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ సన్నాహక సమావేశంలో ఆయన మాట్టాడారు. తుమ్మితే ఊడిపోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసుకొని కాంగ్రెస్ నాయకులు ఎగురుతున్నారని, వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఎవ్వరికీ భయపడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి, అరాచకాలను బయటపెడతామన్నారు. సరిగ్గా ఏడాది క్రితం అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తిడుతూ, దేవుని మీద ఒట్లు పెడుతూ ఇచ్చిన హామీలకు తూట్లు పెడుతున్నాడని మండిపడ్డారు.
ఉచిత బస్సు గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని, వాటికి భయపడే సమస్యే లేదన్నారు. వేములవాడకు వచ్చిన రేవంత్ నాలుగు మంచి మాటలు చెప్పి పోతాడని అనుకున్నానని, గుండుకు దెబ్బ తాకితే మోకాలికి మందు పెట్టినట్లు నూలు డిపోను రాష్ట్రంలోనే అత్యధికంగా నేతన్నలు ఉన్న సిరిసిల్లలో కాకుండా వేములవాడలో ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. నేరెళ్లలో జరిగిన ఘటనకు తాను స్పందించి వారికి ఎంతో కొంత సహాయం చేశానని, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనకు సీఎం స్పందించలేదన్నారు. లగచర్ల ఘటనలో అధికారులు పోతే ఉరికిచ్చారని, ఒకవేళ రేవంత్ రెడ్డి వెళితే ఉరికించి, ఉరికించి కొట్టేవాళ్లని అన్నారు. ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర నుంచి చిల్లిగవ్వ తేలేదని, బీజేపీ కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీ మనుషులేనన్నారు.
అమ్మ విలువ, అన్నం విలువ ఉన్నప్పుడే తెలుస్తుందని, తెలంగాణలో ఇప్పుడు అదే నడుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు పొట్టు పొట్టు తిడుతున్నారని, ఎవరిని కదిపినా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి అదాని కోసం, కుటుంబ సభ్యుల కోసం పని చేస్తున్నాడని, మాట్లాడితే ఢిల్లీకి వెళుతూ ప్రజాధనాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల మనసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఉందని, పిలుపునిస్తే ప్రజలు సంవత్సరికం పెట్టడానికి కూడా వెనకాడరని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుని రూపంలో కలెక్టర్
ప్రజలందరికి కోరిక మేరకు సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని, అద్భుతంగా కట్టుకున్న కలెక్టరేట్ లో కాంగ్రెస్ కార్యకర్తగా కలెక్టర్ వచ్చి కూర్చున్నాడన్నారు. స్వయంగా కలెక్టరే బీఆర్ఎస్ నాయకులను పార్టీ మారమని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. సన్నాసులను తీసుకువచ్చి కాంగ్రెస్ నేతలు కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాదు తాత, జేజమ్మ దిగివచ్చినా జిల్లా బీఆర్ఎస్ నేతల వెంట్రుక కూడా పీకలేరన్నారు. కలెక్టర్, అధికారులు, పోలీసులు చేస్తున్న అరాచకాలను రాసి పెట్టుకొమ్మని, అసలే తాను మంచివాడిని కాదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా ఓవర్ చేస్తున్న అధికారులకు వడ్డీతో సహా ముట్టజెబుతామన్నారు.
దీక్ష దివాస్ పై దిశా నిర్దేశం
పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కారణం బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ నాయకుడు కేసీఆరేనని చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. 14 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముందుందన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేసిన పోరాటాన్ని, విద్యార్థులు చేసుకున్న బలిదానాన్ని, ఉద్యమ నాయకులు చేసిన త్యాగాలను ఎన్నటికీ మరిచిపోరన్నారు.
ఉక్కు సంకల్పంతో బక్క మనిషి కేసీఆర్ కదిలి ఆమరణ నిరహార దీక్ష స్వీకరించిన రోజు నవంబర్ 29 అని, ఆయన చేపట్టిన దీక్షతో ఢిల్లీ పెద్దలు కదిలి రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 ఎంత ముఖ్యమో, అంతే ముఖ్యమైన రోజు నవంబర్ 29 అని అన్నారు. కేసీఆర్ దీక్షకు కూర్చున్న నవంబర్ 29 రోజును దీక్ష దివాస్ గా నిర్వహించబోతున్నామని, అలాగే తెలంగాణ స్వరాష్ట్ర ప్రకటన జరిగిన డిసెంబర్ 9న విజయ్ దివాస్ గా నిర్వహించబోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.