ఇక్కడ అయిష్టత ఎందుకో ?

ఎల్లారెడ్డిపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ లో పనిచేయడానికి వచ్చే ఎస్సైలు అయిష్టంగా వస్తున్నారని చర్చ జరుగుతుంది.

Update: 2024-11-26 09:22 GMT

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ లో పనిచేయడానికి వచ్చే ఎస్సైలు అయిష్టంగా వస్తున్నారని చర్చ జరుగుతుంది. ఇప్పటికీ గడిచిన రెండు సంవత్సరాల్లో ముగ్గురు ఎస్సైలు బదిలీ కావడం ఎల్లారెడ్డి పేట పోలీస్ సర్కిల్ పరిధిలో ఆలోచనకు గురిచేస్తుంది. ఎల్లారెడ్డి పేట సర్కిల్ పరిధిలో గల ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఎస్సై రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు పనిచేస్తుండగా గంభీరావు పేట పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఎస్సైలు మాత్రం మూడు లేదా ఆరు నెలల లోపు అయిష్టత వ్యక్తం చేస్తూ మరో చోటికి బదిలీ పై వెళ్తున్నారని బహిరంగ చర్చ జరుగుతుంది. ఇలా బదిలీలు చేయించుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. గతంలో పనిచేసిన బొజ్జ మహేష్ అనే ఎస్సై మాత్రమే ఇక్కడ రెండు సంవత్సరాల పాటు పనిచేసి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్ళారు.

అప్పటి నుండి వచ్చిన ఎస్సైలలో స్థిరత్వం లోపించించింది. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తున్న ఎస్సై రామ్మోహన్ ఇక్కడికి బదిలీ పై వచ్చి దాదాపు ఎనిమిది నెలల పాటు పనిచేసి ఇక్కడి నుండి ఇదే జిల్లా తంగల్లపల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్ళారు. అనంతరం సిద్దిపేట్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి గంభీరావు పేటకు సెప్టెంబర్ 21 న జాయిన్ అయిన శివకుమార్ నవంబర్ 21 న బదిలీపై వెళ్ళారు. అనంతరం గతంలో బోయినపల్లి ఎస్సైగా పనిచేసిన శ్రీకాంత్ అనే ఎస్సై ఇక్కడికి బదిలీ పై వచ్చారు. మూడు నెలల్లో ముగ్గురు ఎస్సైలు మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓ హెడ్ కానిస్టేబుల్ పుష్కరాల సమయంలో డ్యూటీ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే మృతి చెందాడు. కాగ వాస్తు కోసం గేట్, మరికొన్ని మార్పులు కూడా చేశాడు. ఇదే పోలీస్ స్టేషన్ కు కింది పక్కన ఎడమ వైపు ప్రధాన గేటు ఉండేది. కానీ దానిని ఇటీవలి కాలంలో ప్రధాన గేటును పోలీస్ స్టేషన్ కు కుడివైపు పై భాగంలో నిర్మించారు. అంతే కాకుండా ఈ పోలీస్ స్టేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చిట్టచివరి మండలంగా ఉండడం అక్కడ సరైన వసతులు లేకపోవడం ఎస్ఐగా పనిచేస్తున్న వారి పిల్లలకు సరైన స్థాయిలో నాణ్యమైన విద్యకు సంబంధించి ప్రైవేట్ పాఠశాలలు సైతం అందుబాటులో లేకపోవడం ఒక కారణం కాగా ఆరోగ్య రీత్యా అన్ని వసతులు కలిగిన హాస్పిటల్స్ లేక పోవడం, రాత్రి పూట ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడితే గంభీరావుపేట నుండి సిరిసిల్లకు, లేదా సిద్దిపేటకు, లేదా కామారెడ్డికి ఎటు వెళ్లినా 30 కిలో మీటర్ల దూరంకు పైగా పోవాల్సి వస్తుందని మరో కారణం చెబుతున్నారు.

అంతే కాకుండా పోలీస్ సిబ్బంది ఉండడానికి సరైన పోలీస్ క్వార్టర్స్ కూడా సరిగా లేకపోవడం, ఉన్న క్వార్టర్స్ శిధిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది పోలీస్ సిబ్బంది ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, సిద్దిపేట నుండి అనునిత్యం విధి నిర్వహణ కోసం ప్రతి రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. మళ్ళీ ఇది మారుమూల మండలం కావడంతో ఎలాంటి సదుపాయాలు సరిగా లేకపోవడం ఎస్ఐ స్థాయి అధికారులు ఇక్కడ పనిచేయడానికి అయిష్టత కనబరుస్తున్నారని వినబడుతుంది. పోలీస్ స్టేషన్ కు ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడం, చిన్నచిన్న ఖర్చులు భరించడం కూడా కష్టంగా మారి పోలీస్ స్టేషన్ వ్యవహారాలు చక్కదిద్దడం కూడా భారంగా మారుతుందని మరో కారణంగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో పోలీస్ స్టేషన్ కు సంబంధించి చిన్న పాటి ఖర్చులు వెళ్లదీయడం కోసం ఒక సెల్ పోన్ కంపెనీ టవర్ ను పోలీస్ స్టేషన్ ఆవరణలో నెలకు సుమారు 25 వేల రూపాయలు కిరాయి వచ్చేలా సంబంధిత కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నా, స్టేషన్ చుట్టూ నివాసం ఉంటున్న ప్రజలు పోలీస్ స్టేషన్ లో సెల్ టవర్ ఏర్పాటు చేయడం ద్వారా రేడియేషన్ రావడం, అనారోగ్యాలకు గురవుతామని ప్రజలు చెబుతుండగా పోలీస్ స్టేషన్ నిర్వహణ భారంగా మారుతుందని ఇక్కడ పని చేయడం కొంత కష్టమేనని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన శిధిలావస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ స్థానంలో కొత్త క్వార్టర్స్ నిర్మించే ఏర్పాట్లు చేయాలని పోలీస్ సిబ్బంది కోరుతున్నారు.


Similar News