ప్రమాదాలకు నిలయం.. సైదాపూర్ చౌరస్తా..
హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ చౌరస్తా ప్రమాదాలకు నిలయంగా మారింది.
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ చౌరస్తా ప్రమాదాలకు నిలయంగా మారింది. డబుల్ రోడ్ విస్తరించి రోడ్డు మధ్యలో డివైడర్ను నిర్మించి మధ్యన మొక్కలు నాటి, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి చౌరస్తాను అందంగా తీర్చిదిద్దారు. ఇలాంటి విశాలమైన రహదారి పై సైదాపూర్ చౌరస్తాలో ప్రమాదాలు నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలను మాత్రం మరిచారు. గత కొద్ది రోజుల నుంచి టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ కానిస్టేబుల్ లను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ చౌరస్తాతో పాటు సైదాపూర్ చౌరస్తాలో సైతం ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
పట్టణ ప్రజలకు ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ రూల్స్ ను పోలీసులు అలవాటు చేస్తున్నారు. అయినప్పటికీ సైదాపూర్ చౌరస్తా జిగ్జాగ్ గా ఉండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ చౌరస్తాకు పక్కనే కోర్టు యూటర్న్ ఉండడం, వరంగల్ వైపులో బస్టాండ్ అవుట్ సైడ్ బస్సులు వెళ్లే డివైడర్ ఉండడం ప్రమాదాలకు కారణం అవుతుంది. కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కోర్టు వైపునుంచి సైదాపూర్ చౌరస్తా వైపు అధిక స్పీడుతో వచ్చే వాహనాలు, ఒకవైపు కూరగాయల మార్కెట్, మున్సిపాలిటీకి వెళ్లే రహదారి ఉండడంతో వాహనాలు ఆ ప్రాంతంలో కిక్కిరిసిపోతున్నాయి. వరంగల్ - కరీంనగర్, కరీంనగర్ - వరంగల్ కు వెళ్లే వాహనాలు అతివేగంతో రావడం వల్ల విద్యానగర్ నుంచి, మున్సిపాలిటీ నుంచి బస్టాండ్ నుంచి రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనదారులు, పాదాచార్యులు ప్రమాదాలకు గురవుతున్నారు.
తరుచూ ప్రమాదాలు..
గత రెండు రోజుల క్రితం హెల్త్ అసిస్టెంట్ వకలాభరణం రమేష్ మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనం పై తన నివాస ప్రాంతమైన విద్యానగర్ వెళుతూ సైదాపూర్ చౌరస్తాలో కారు ఢీకొని మృత్యువాత పడ్డాడు. అలాగే గత కొద్ది రోజుల క్రితం మున్సిపల్ సిబ్బంది రోడ్లను శుభ్రం చేస్తుండగా తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయపడ్డారు. ఇలా రికార్డులోకి ఎక్కని ఎన్నో ప్రమాదాలు ఇక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో గాయపడుతున్న క్షతగాత్రులు, మృత్యువాత పడుతున్న వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. యూటర్న్ ల వద్ద సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, సైదాపూర్ రోడ్ లో వివిధ గ్రామాలకు వెళ్లే ఆటోలను పార్కింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాత్రి వేళల్లో కార్లు, భారీ వాహనాలు ద్విచక్ర వాహనదారులు మద్యం సేవించి అధిక వేగంతో అజాగ్రత్తగా వాహనాలు నడుపుతుండడం వల్ల రోడ్డు దాటుతున్న పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలిసింది. సైదాపూర్ చౌరస్తాతో పాటు బస్టాండ్ డివైడర్, కోర్టు డివైడర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.. సీఐ తిరుమల్ గౌడ్
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాను హుజురాబాద్ లో విధులు నిర్వర్తించినప్పటి నుంచి ప్రత్యేకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ లను ఏర్పాటు చేశామన్నారు. వేగం నియంత్రణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రతి వాహనదారుడికి సూచిస్తున్నామన్నారు. దుకాణాల ముందు వాహనాలను నిలపకూడదని వాహనదారులను కోరుతున్నామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి జరిమానాలు విధిస్తున్నాం. వాహనదారులు రోడ్డు ప్రమాదాల నివారణల పై అవగాహన కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సైదాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసేలా అధికారులకు నివేదిక అందిస్తామన్నారు.