పనికోసం వెళ్లిన భర్త.. ఆచూకీ కోసం అల్లాడుతున్న భార్య..

ఉపాధి నిమిత్తం ఖతార్ దేశానికి వలస వెళ్లిన తన భర్త ఫోన్ చేసి 6 నెలలు అయ్యిందని సునీత అనే మహిళ మంగళవారం హైదరాబాద్ లో ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Update: 2024-11-27 05:51 GMT

దిశ, గొల్లపల్లి : ఉపాధి నిమిత్తం ఖతార్ దేశానికి వలస వెళ్లిన తన భర్త ఫోన్ చేసి 6 నెలలు అయ్యిందని సునీత అనే మహిళ మంగళవారం హైదరాబాద్ లో ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎక్కడున్నాడో జాడ తెలియడం లేదని ఆచూకీ కనిపెట్టాలని ప్రజావాణిలో కోరారు. సునీత తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామానికి చెందిన రాసూరి రాజేందర్ ఉపాధి నిమిత్తం ఖతార్ వెళ్ళాడు. అయితే అక్కడ తన ఉద్యోగం పోయిందని, మాల్టా దేశానికి వెళ్ళడానికి డబ్బులు కావాలని భార్యను, తల్లిని కోరాడు.

దీంతో వారు అప్పుచేసి రూ.5 లక్షలు ఖతార్ కు పంపించారు. ఆ డబ్బు ముట్టిన తర్వాత ఫోన్ స్విచాఫ్ వస్తుందని, గత ఆరు నెలలుగా అతని జాడ తెలియడం లేదని అన్నారు. ఖతార్ లో ఉన్నాడా, ఇండియాలో ఉన్నాడా తెలియడం లేదని ఎలాగైనా తన భర్తను వెతికి పెట్టాలని సునీత కోరింది. దీంతో స్పందించిన ప్రవాసి ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ పోలీసుల ద్వారా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయించాలని జగిత్యాల జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి నరేష్ ను ఆదేశించారు.


Similar News