ఉన్నతాధికారులను వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ దే.. టీపీసీసీ కో-ఆర్డినేటర్

ఉన్నతాధికారులను కార్యకర్తలా వాడుకున్న చరిత్ర కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్నిదేనని, ప్రజా పాలనలో పార్టీలకు తావు లేకుండా అధికారులు నిస్వార్ధంగా సేవలందిస్తున్నారని టీపీసీసీ కో ఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ అన్నారు.

Update: 2024-11-27 07:50 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ఉన్నతాధికారులను కార్యకర్తలా వాడుకున్న చరిత్ర కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్నిదేనని, ప్రజా పాలనలో పార్టీలకు తావు లేకుండా అధికారులు నిస్వార్ధంగా సేవలందిస్తున్నారని టీపీసీసీ కో ఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ జిల్లాస్థాయి అధికారుల పై అసభ్యంగా మాట్లాడిన తీరును తప్పుపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు కండువా వేసుకున్న కార్యకర్తలతో పని చేయించుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని, దీనిని జీర్ణించుకోలేక కేటీఆర్ రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నాడని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్లకు నూలు డిపో తెలేదుగాని, వేములవాడలో ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇక్కడి రైతులు, కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో రైతులు, చేనేత కార్మికులు సుభిక్షంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సంగీతం శ్రీనివాస్ హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు.


Similar News