ఉద్యమకారులారా బహుపరాక్.. కేసీఆర్ చేతిలో మళ్లీ మోసపోకండి : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్

తెలంగాణ ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మళ్లీ మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నాడని, ఉద్యమకారులు కేసీఆర్ మాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమర్ అన్నారు.

Update: 2023-08-20 13:51 GMT

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది

దిశ, తిమ్మాపూర్ : తెలంగాణ ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మళ్లీ మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నాడని, ఉద్యమకారులు కేసీఆర్ మాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమర్ అన్నారు. ఆదివారం తిమ్మాపూర్ గ్రామంలో మాజీ బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల జోగిరెడ్డితో పాటు పలువురు ఉద్యమకారులను కలవగా తెలంగాణ ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలని వారు ఆయనకు వినతి పత్రం సమర్పించారు.

అనంతరం అయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను ఎన్నడో మర్చిపోయాడని, కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్లంతా తెలంగాణ ఉద్యమ ద్రోహులేనని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో ఉద్యమకారులను దువ్వే పనిలో పడ్డారని ఆరోపించారు. మరోసారి కేసీఆర్ చేతిలో మోసపోవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను బీజేపీ రాష్ట్ర అధిష్టానం అతి త్వరలోనే పార్టీ ప్రకటిస్తుందని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ అధికారం కోసం, అవసరమైనప్పుడు మాత్రమే అమరవీరులకు జోహార్లు అంటాడని ఆ తరువాత వాళ్ల ఊసెత్తడని అన్నారు. ఉద్యమకారుల వల్ల తెలంగాణ వస్తే అధికారం అనుభవిస్తున్నది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసి తెలంగాణ పదాన్ని తొలగించాడని విమర్శించారు. మహారాష్ట్ర పోయి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేదన్నారు. కేసీఆర్ లెఫ్ట్, రైట్ ఉన్నోళ్లంతా ఉద్యమద్రోహులేనని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజల పాలన వస్తుందనుకుంటే కేసీఆర్ కుటుంబ పాలనతో దివాళా తీయించాడని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికే తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

కేసీఆర్, హరీష్ రావు ఏ ప్రాంతానికి పోయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో మీ కాళ్లు కడుగుతామని చెబుతున్నారని, కానీ ఆ నీళ్లన్ని ఫాంహౌజ్ కే పోతున్నయని ఏద్దేవ చేశారు. కాళేశ్వరంతో రాష్ట్రంలో ఎంతమంది కాళ్లు తడిపారో, ఎన్ని ఎకరాలను నీళ్లిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు సహా అన్ని వర్గాలు కేసీఆర్ పాలనపై విసిగి రోడ్డెక్కుతున్నారని తెలిపారు. బీజేపీ తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటుందని అన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను అతి త్వరలోనే బీజేపీ ప్రకటిస్తుందని అన్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. మాది కేసీఆర్ లా ఏక్ నిరంజన్ పార్టీ కాదని నేను అసెంబ్లీకి పోటీ చేయాలా.. పార్లమెంట్ కు పోటీ చేయాలా.. ఎక్కడ పోటీ చేయాలనే విషయంపై హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. తనకు పార్టీ నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశాన్ని సీబీఐ, ఈడీ సంస్థలు చూసుకుంటాయని తెలిపారు.

బీజేపీ సిద్ధాంతాలు, మోదీ విధానాలు నచ్చి పార్టీలోకి వచ్చే వాళ్లను చేర్చుకుంటామని పేర్కొన్నారు. మానకొండూరు సహా తెలంగాణలో మోదీని బూతులు తిట్టినోళ్లను, బీజేపీని బద్నాం చేసినోళ్లను పార్టీలోకి రానివ్వబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, దరువు ఎల్లన్న,బొంతల కళ్యాణ్ చంద్ర, మానకొండూరు నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం నాగరాజు, మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వర చారి, నాయకులు బూట్ల శ్రీనివాస్, మావురపు సంపత్, పబ్బ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News