వర్షాల కారణంగా విద్యుత్ శాఖ అలర్ట్.. ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో విద్యుత్ శాఖ అలర్ట్ అయింది.
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో విద్యుత్ శాఖ అలర్ట్ అయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సిబ్బందిని ఆదేశించారు. ఈమేరకు ఆయన సోమవారం సూపరింటెండింగ్ ఇంజినీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ సమస్యలకు స్కేడా లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1912 లేదా, 100, 7382071574, 7382072106, 7382072104 నంబర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని, సమస్యలుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసే వినియోగదారులు తమ బిల్లు పై ముద్రితమైన యూఎస్ సీ నంబర్ ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. విద్యుత్ లైన్లు, స్తంభాలకు, ఇతర విద్యుత్ పరికరాలపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి రఘుమా రెడ్డి సూచనలు చేశారు. ఎక్కడైనా రోడ్డుపై కానీ నీటిలో కానీ విద్యుత్ తీగ పడి ఉంటే స్థానికంగా ఉండే విద్యుత్ సిబ్బందికి కానీ, కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని సూచించారు.