ఆరోగ్య మిత్రలకు పదోన్నతి.. వేతనాలు పెంపు

ఆరోగ్యమిత్రల వేతనాలు పెంచుతామని, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతి కల్పిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా హామీ ఇచ్చారు...

Update: 2024-09-20 15:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యమిత్రల వేతనాలు పెంచుతామని, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతి కల్పిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా హామీ ఇచ్చారు. దీంతో మూడు రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు ఆరోగ్య మిత్రలు ప్రకటించారు. ఈ మేరకు సీఐటీయూ నాయకుడు భూపాల్ నేతృత్వంలోని ఆరోగ్య మిత్రలు శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి దామోదర రాజ నర్సింహాను కలిసి చర్చలు జరిపారు. దశాబ్ద కాలంగా తక్కువ వేతనాలకు తాము పనిచేస్తున్నామని, వేతనాలు పెంచి తమను ఆదుకోవాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తమకు రూ.15,600 చొప్పున చెల్లిస్తున్నారని, రూ.22 వేలకు పెంచాలని ఆరోగ్య మిత్రలు కోరారు. అధికారులతో చర్చించిన మంత్రి రూ.19,500లకు వేతనాలను పెంచేందుకు అంగీకరించారు. అలాగే, ఆరోగ్య మిత్రలకు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతి కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హెల్త్ కార్డులు, ఇతర డిమాండ్లపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ సీఈవో విశాలక్షి, ఇతర అధికారులు పాల్గొన్నారు


Similar News