ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు.. పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసేలా ప్లాన్
రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి సైతం ఈ అంశంపై దృష్టిసారిస్తోంది. అయితే ఈ పోస్టుల భర్తీ బాధ్యతలు ఆయా వర్సిటీలకే ఇవ్వాలా? ఏ విధంగా చేపడితే బాగుంటుందనే అంశంపై ఉన్నత విద్యామండలి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణికి బాధ్యతలు అప్పగించింది. సభ్యులుగా ఉస్మానియా, మహాత్మగాంధీ వర్సిటీల వీసీలు మొలుగారం కుమార్, ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ను నియమించింది. ఇదిలా ఉండగా వారికి తోడుగా మరో ఇద్దరు అదనపు నిపుణులను సైతం అందించనున్నట్లు ఉన్నత విద్యామండలి స్పష్టంచేసింది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో భర్తీ చేసే విధానాలు, ఇక్కడి విధానాలపై ఒక నివేదికను రూపొందించనుంది. ఆపై ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. దాని ఆధారంగానే ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు.
వర్సీటీల్లో వెయ్యికి పైగా ఖాళీలు..
తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో వెయ్యికి పైగా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఎన్నో ఏండ్లుగా యూనివర్సిటీల్లో రిక్రూట్‌మెంట్ లేక ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. గత ప్రభుత్వం ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నియామక బోర్డును ఏర్పాటుచేసింది. అసెంబ్లీలో ఆమోదించిన బోర్డు బిల్లును ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. గవర్నర్ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. అప్పటి నుంచి ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ ఖాళీ పోస్టుల భర్తీపై దృష్టిసారించింది.
అయితే రాష్ట్రపతి వద్ద అపాయింట్‌మెంట్ బోర్డు బిల్లు పెండింగ్‌లో ఉండగా మరో ఏజెన్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ఆమోదించిన అపాయింట్‌మెంట్ బోర్డు బిల్లును ఉపసంహరించుకోవాలని సర్కార్ యోచిస్తోంది. ఈనేపథ్యంలోనే ప్రత్యేకంగా కమిటీని ఉన్నత విద్యామండలి నియమించింది. ఈ కమిటీ పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నియామక ప్రక్రియను భర్తీచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నియామకాల్లో గందరగోళ పరిస్థితులకు తావులేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఏర్పాట్లలో నిమగ్నమైంది.
యూనివర్సిటీలకే భర్తీ అవకాశం ఇవ్వాలి: భైరు నాగరాజు గౌడ్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
విశ్వవిద్యాలయాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల భర్తీ యూనివర్సిటీల ద్వారానే చేపట్టాలి. స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీలను నిర్వీర్యం చేయొద్దు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియామక మండలి పేరుతో నిర్లక్ష్యం చేసింది. దీంతో ఖాళీలు విపరీతంగా పెరిగిపోయాయి. యూనివర్సిటీల బిల్లును అసెంబ్లీలో పాస్ చేసినా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినా భర్తీలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. అందుకే ఆయా యూనివర్సిటీలకే బాధ్యతలు అప్పగించి పరీక్ష నిర్వహించి మెరిట్ ద్వారా భర్తీ చేపట్టాలి.