ఫ్యూచర్ సిటీ vs నియోపొలిస్.. హైరైజ్డ్ బిల్డింగ్స్‌తో హాట్ టాపిక్
రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఇప్పటి దాకా హాట్ టాపిక్‌గా నిలిచిన వాటిలో నియోపొలిస్ ఒకటి.

దిశ, తెలంగాణ బ్యూరో: రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఇప్పటి దాకా హాట్ టాపిక్‌గా నిలిచిన వాటిలో నియోపొలిస్ ఒకటి. ఎకరం రూ.100 కోట్ల ధర పలకడంతో దేశమంతా దృష్టి సారించింది. వామ్మో! అంత కాస్లీయా అంటూ చర్చించుకున్నారు. హైదరాబాద్ ఐటీ, రియాలిటీ రంగాల్లో కోకాపేట ఓ స్పెషల్. కొలమానంగా నిలిచింది. గడిచిన 15 ఏండ్లల్లో ఎవరూ ఊహించిన స్థాయిలో అభివృద్ధి చెందింది. 2010కి ముందు అక్కడి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి.. రెండింటినీ సరిపోల్చుకుంటే ఊహకు కూడా అందనంత మార్పు కనిపిస్తున్నది. కొండలు, గుట్టలు తప్ప అక్కడేమున్నది అనే నాటి పరిస్థితి నుంచి పెద్ద పెద్ద బిజినెస్ దిగ్గజాలు, ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, పెద్ద పెద్ద కంపెనీలు వెలస్తున్న కేరాఫ్ అడ్రస్‌గా మారిందిప్పుడు.
మీ ఏరియాను మరో కోకాపేటను చేస్తామని ఎన్నికల్లో నేతలు హామీ ఇచ్చే లెవెల్‌కి ఎదిగింది కోకాపేట రియల్ ఎస్టేట్ ప్రయాణం. అటు కంపెనీలకు, ఇటు కొనుగోలుదార్లకు కేంద్రంగా మారుతోంది. పక్కనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సాఫ్ట్ వేర్ కంపెనీలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఉండటంతో మస్తు డిమాండ్ ఏర్పడింది. కాగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరో టాపిక్‌ని హాట్ హాట్‌గా మార్చేసింది. ఏంటంటే.. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్.. ఫ్యూచర్ సిటీ. ఇది ఆవిర్భవిస్తే హైదరాబాద్ నగర శివారు ప్రాంత రూపురేఖలే మారిపోతాయన్న చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో నియోపొలిస్ గురించి రియల్ ఎస్టేట్ వర్గమంతా మరింత ఎక్కువగా మాట్లాడుకుంటోంది. స్కై స్క్రేపర్స్ గురించి ప్రస్తావించిన ప్రతీసారి నియోపాలిస్ చర్చకు వస్తుంది. ఇప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్ల గురించి మాట్లాడాలంటే ముందు గుర్తొచ్చేది ఫ్యూచర్ సిటీగా వినిపిస్తున్నది.
స్మాల్ విలేజ్.. ఇంటర్నేషనల్ సిటీ
రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో మారుమూల శివారు ప్రాంతం. గండిపేట మండలంలోని ఓ చిన్న గ్రామమైన కోకాపేట ఇప్పుడు అభివృద్ధికి కొలమానంగా మారింది. ఆకాశాన్ని అందుకేలా నిర్మాణాలతో, మల్టీ నేషనల్ కంపెనీలతో, విశాలమైన రోడ్లతో, అద్భుతమైన కనెక్టివిటీతో అలరారుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ సిటీ రేంజ్‌లో కనిపిస్తున్నది. ఐటీ కారిడార్‌ను ఆనుకుని ఉండటమే కోకాపేటకు కలిసొచ్చింది. హైద్రాబాద్‌లో హైటెక్ సిటీతో మొదలైన ఐటీ డెవలప్‌మెంట్ మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటూ కోకాపేట వరకు వెళ్లిపోయింది. కంపెనీలకు దగ్గరగా ఉండాలని ఉద్యోగులు భావించారు. సిటీలో స్థలం లేదు.. పక్కనే ఉన్న కోకాపేట బెటర్ అనుకుంటూ కంపెనీలన్నీ అక్కడికి క్యూ కట్టాయి. అందరి ఫస్ట్ ఛాయిస్ కోకాపేటగా మార్చేశారు.
అత్యంత కాస్లీ ఏరియా
కోకాపేట.. అంటే వెంటనే గుర్తొచ్చేది ఎకరం రూ.100 కోట్లు పలికిన భూమియే. మోస్ట్ బిజియెస్ట్ మెట్రో సిటీస్‌లో కూడా సాధ్యం కాని రేట్ ఫీట్ కోకాపేట సొంతం. ఇక్కడి ల్యాండ్స్ దక్కించుకోడానికి రియల్ ఎస్టేట్ కంపెనీల మధ్య ఉన్న కాంపిటీషన్ కోకాపేట స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. ఇక భారీ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి, పోటాపోటీగా వెలుస్తున్న స్కై స్క్రేపర్స్ అత్యంత ఆకర్షణీయమైన ఏరియాగా మార్చేశాయి. ఇక్కడ భూములంటే బంగారం కంటే ఎక్కువ. రియాలిటీ కంపెనీలకే కాదు.. ప్రభుత్వాలకు కూడా కల్పతరువే ఈ ప్రాంతం. ప్రభుత్వం ఇక్కడి భూములను వేలం వేసి రూ. వేల కోట్లతో ఖజనా నింపుకున్నది. నియోపొలిస్ పక్కనే ఉండటం. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ సహా ఐటీ కారిడార్‌లో ఖాళీ స్థలాల సంఖ్య తగ్గిపోవడంతో కంపెనీలన్నీ కోకాపేట వైపే దృష్టి సారించాయి.
లగ్జరీ లివింగ్ ఏరియా
లగ్జరీ అండ్ పీస్‌ఫుల్ లైఫ్ స్టైల్‌ను కోరుకునే వారికి ఫేవరేట్ ప్లేస్‌గా, రియాల్టీ సెక్టార్‌కి కోటగా మారింది కోకాకపేట. సాస్ ఇన్‌ఫ్రా, పౌలోమీ, రాజపుష్ప, మై హోమ్ లాంటి హైద్రాబాద్‌లోని ప్రముఖ బిల్డర్లంతా ఇక్కడ లగ్జరీ ప్రాజెక్ట్‌లు డెవలప్ చేస్తున్నాయి. ఈ స్థాయిలో కోకాపేట పేరు మారు మోగిపోవడానికి మరో కారణం నియోపొలిస్ లే అవుట్. నియోపొలిస్ అంటే ఇటాలియన్‌లో న్యూ సిటీ అని అర్థం. ఈ ప్రాంతంలో హెచ్‌ఎండీఏ చేపట్టిన డెవలప్ చూస్తే మతిపోవాల్సిందే. స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో అభివృద్ధి జరుగుతున్న నియోపొలిస్ మొత్తం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టే. 36, 45 అడుగుల వెడల్పైన విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్, డ్రింకింగ్ వాటర్, డ్రైనైజీ లైన్స్, పార్క్‌లు ఒకటేంటి అన్నీ అత్యాధునిక మోడల్‌లో ఏర్పాటు చేస్తున్నారు. చుట్టు పక్కల భూముల్లోనూ భారీ సంఖ్యలో 30 నుంచి 59 అంతస్థుల ఎత్తైన హై రైజ్ అపార్ట్‌మెంట్స్ వెలుస్తున్నాయ్. కమర్షియల్, ఆఫీస్ స్పేస్‌లతో పాటు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్‌లు కూడా ఎక్కువే.
56 రెవెన్యూ గ్రామాలతో సిటీ
రంగారెడ్డి జిల్లాలో ఏడు మండలాల పరిధిలోని 56 రెవెన్యూ గ్రామాలతో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్‌గా, పురపాలక శాఖ, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రులు వైస్ చైర్మన్లుగా వ్యవహరిస్తారు. సీఎస్, ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, పరిశ్రమలు, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, పర్యావరణ, అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హెచ్‌ఎండీఏ కమిషనర్, హైదరాబాద్ డీటీసీపీ సభ్యులుగా ఉంటారు. అథారిటీ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. ఈ నెల 12న ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి ఏడు మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలను చేర్చుతూ గెజిట్ కూడా విడుదలైంది. ప్రభుత్వం పకడ్బందీ వ్యూహరచనతో, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ ప్రాజెక్టు, అథారిటీ గురించి రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పక్కా ప్లాన్ .. సక్సెస్ అయితే..
ఒకప్పుడు కోకాపేట అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. ఫ్యూచర్ సిటీ భవిష్యత్తునూ ఎవరూ ఊహించలేరు. కానీ మరో పదేండ్లల్లో దీని పరిధిలోని 56 రెవెన్యూ గ్రామాల రూపురేఖలు మారుతాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఫార్మా సిటీకి కేటాయించిన స్థలంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పోర్ట్స్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులను ప్రతిపాదించారు. కొన్ని ఇప్పటికే పట్టాలెక్కాయి. మరికొన్ని ప్లానింగ్ దశలో ఉన్నాయి. అత్యంత సమీపంలోనే ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఇటు వైపు కూడా మెట్రో రైలు ప్రాజెక్టును అనుసంధానించాలని సీఎం ప్రతిపాదించారు. అటు శంషాబాద్ ఎయిర్ పోర్టు, మరో వైపు ఎల్బీనగర్, నాగోలు మెట్రోలకు అనుసంధానించడం ద్వారా నలువైపులా సిటీకి వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.
వెలుగులోకి ఆదిభట్ల
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తో ఆదిబట్లలోనూ పాటు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. కానీ ఇప్పటి దాకా పెద్దగా చర్చలోకి రాలేదు. అయితే ఫ్యూచర్ సిటీని ప్రకటించగానే దానికి పక్కనే, ఔటర్ లోపలే ఉన్న ఆదిబట్ల మున్సిపాలిటీ, తుర్కయంజాల్ మున్సిపాలిటీల్లోనూ బహుళ అంతస్థుల భవనాలకు శ్రీకారం చుడుతున్నారు. మరో వైపు 56 గ్రామాల్లోనూ బడా కంపెనీలు భూములు కొనేందుకు వేటలో పడ్డారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు వందల ఎకరాల ల్యాండ్‌ని పూల్ చేసి పెట్టుకున్నాయి. ఇక్కడి ప్రాజెక్టులు పట్టాలెక్కగానే భారీ వెంచర్లను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.