Madhu Yashki Goud: వాళ్లు పార్టీపై ప్రేమతో రాలేదు.. పార్టీ ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు పార్టీపై ప్రేమతో రాలేదని కాంగ్రెస్ సీనియర్ లీడర్, టీపీసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, జగిత్యాల ప్రతినిధి: పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు పార్టీపై ప్రేమతో రాలేదని కాంగ్రెస్ సీనియర్ లీడర్, టీపీసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల అక్రమాస్తులను కాపాడుకోవడానికే కాంగ్రెస్‌లో చేరుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సిద్ధాంతాలంటే వాళ్లకి అసలు విశ్వాసమేలేదని ఆయన నిప్పులు చెరిగారు. ఇటీవల జీవన్ రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి హత్య జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు మధుయాష్కి గౌడ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్‌లతో కలిసి గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
గంగారెడ్డి హత్యపై విచారం వ్యక్తం చేసిన ఆయన కుటుంబాన్ని పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసును లోతుగా దర్యాప్తు చేయకుండా పాత కక్షలే హత్యకు కారణమంటూ పోలీసులు తెలపడం విచారకరమన్నారు. తనకు ప్రాణహాని ఉందని గంగారెడ్డి ముందుగానే పోలీసులకు తెలిపినప్పటికీ పోలీసుల నిర్లక్ష్యం వల్లనే కాంగ్రెస్ పార్టీ మంచి కార్యకర్తను కోల్పోయిందన్నారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మధుయాష్కి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గంగారెడ్డి హత్య అత్యంత దురదృష్టకరమని ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
ఈ విషయంపై సీఎంతో పాటు డీజీపీలను కలిసి చర్చిస్తానని, పోలీసులు నిర్లక్షాన్ని వీడి కేసును లోతుగా దర్యాప్తు జరపాలని కోరతానని తెలిపారు. కార్యకర్తల కృషి వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉందని అన్నారు.
అందుకే ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం: మధు యాష్కి
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని పడగొడతామన్న అభద్రతకు గురి చేస్తున్న ప్రతిపక్షాల కారణంగానే కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి ఉన్న ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నట్లు మధు యాష్కి తెలిపారు. అలాగని పార్టీ మారుతున్న వాళ్లు కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి రాలేదని సొంత ప్రయోజనాలతో పాటు వారి అక్రమాస్తులను కాపాడుకునేందుకే వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో వలస వచ్చిన ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవుల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని మొదటి నుండి పార్టీ కోసం పని చేసిన వారికే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొస్తామని పార్టీ మారిన వెంటనే పదవులు కోల్పోయే విధంగా చర్యలు చేపడతామన్నారు.
Read More : MLC Jeevan Reddy: ఫిరాయింపులతో ఆత్మస్థైర్యం కోల్పోయాం.. జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు