విచిత్రమైన వైఖరిలో ఆరోగ్యశాఖ.. కరోనా ప్రబలితే మాకేం సం‘బంధం’
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా ప్రబలితే మాకేం సంబంధం? అన్న తీరుగా వైద్యశాఖ వ్యవహారం కొనసాగుతున్నది. పాఠశాలలు ప్రారంభించబోయే ముందు కరోనాతో పాటు సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాల్సిన ఆరోగ్యశాఖ ఏం తెలియనట్టు దూరంగా ఉంటుందని విద్యాశాఖ ఆరోపిస్తున్నది. కేవలం నామ మాత్రపు మార్గదర్శకాలను సూచించి వైద్యశాఖ చేతులు దులుపుకుందని స్కూల్ టీచర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వం సూచించినట్లు ప్రత్యేక టీంలతో అవగాహన కల్పించడం లేదన్నారు. అంతేగాక స్కూళ్లు ప్రారంభించే ముందు మున్సిపల్ అధికారులతో కలసి ప్రతీ […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా ప్రబలితే మాకేం సంబంధం? అన్న తీరుగా వైద్యశాఖ వ్యవహారం కొనసాగుతున్నది. పాఠశాలలు ప్రారంభించబోయే ముందు కరోనాతో పాటు సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాల్సిన ఆరోగ్యశాఖ ఏం తెలియనట్టు దూరంగా ఉంటుందని విద్యాశాఖ ఆరోపిస్తున్నది. కేవలం నామ మాత్రపు మార్గదర్శకాలను సూచించి వైద్యశాఖ చేతులు దులుపుకుందని స్కూల్ టీచర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వం సూచించినట్లు ప్రత్యేక టీంలతో అవగాహన కల్పించడం లేదన్నారు. అంతేగాక స్కూళ్లు ప్రారంభించే ముందు మున్సిపల్ అధికారులతో కలసి ప్రతీ స్కూల్ ను విజిట్ చేయాల్సిన హెల్త్ ఆఫీసర్లు కనీసం స్పందించడం లేదని ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది నుంచి స్కూళ్లు బంద్ ఉండటంతో ఆయా ప్రాంగణాలన్నీ చెత్త చెదారంతో పాటు వర్షపు నీరు చేరి దోమలు వృద్ధి చెందుతున్నా, ఇటు మున్సిపల్ కానీ, వైద్యశాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని దిశ ప్రతినిధి సెక్రటేరియట్ లో ని వైద్యశాఖకు చెందిన ఓ కీలక అధికారి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కూడా అదే చెప్పుకొచ్చారు. స్కూళ్లల్లో కేసులు వచ్చిన తర్వాతనే వైద్యశాఖకు పని ఉంటుందని, ఆ ముందు చర్యలన్నీ పాఠశాలలదేనని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం. అంతేగాక పిల్లల సేప్టీ అనేది స్కూల్స్, పేరెంట్స్ దేనని ఆయన విచిత్రంగా చెప్పారు.
కేసులు తేలిన తర్వాతనే..
కరోనా సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన వైద్యశాఖ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. పైగా ఆ చర్యల బాధ్యతలను స్కూళ్లు, పేరెంట్స్ కే అప్పజెప్పడం గమ్మత్తుగా ఉన్నది. ప్రతీ స్కూల్లో థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు, శానిటేషన్ తో పాటు మెడికల్ టీంను అందుబాటులో ఉంచాల్సిన వైద్యశాఖ, అవన్నీ స్కూళ్ల బాధ్యతే అన్నట్లు అనధికారికంగా స్పష్టం చేస్తున్నది. కేవలం కేసులు తేలిన తర్వాతనే వైద్యశాఖ రంగంలోకి దిగుతున్నట్లు వివరిస్తున్నది. కేసులు తేలిన స్కూళ్లు సమాచారం ఇస్తే, ప్రైమరీ కాంటాక్ట్ లకు టెస్టులు చేయడంతో పాటు స్కూళ్లను శానిటేషన్ చేపించనున్నట్లు వైద్యశాఖ పేర్కొన్నది. కానీ ఆ ముందు చర్యలు స్వయంగా స్కూళ్లు తీసుకోవాల్సిందేనని వైద్యశాఖ పేర్కొంటున్న విచిత్ర వైఖరిని తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించాలనే భరోసానివ్వాల్సిన వైద్యశాఖ దూరంగా ఉంటే ఎలా? అని పలువురు పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శాఖల మధ్య కొరవడిన సమన్వయం..
స్కూళ్లల్లో చేపట్టాల్సిన కరోనా నివారణ చర్యల్లో విద్యా, వైద్యశాఖల మధ్య సమన్వయం కొరవడింది. ఇప్పటికే పాఠశాలలన్నీ అస్తవ్యస్తంగా మారడంతో విద్యార్ధులను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. థర్డ్ వేవ్ చిన్నారులపై అత్యధికంగా ఉంటుందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేయడంతో , స్కూళ్లలోని నివారణ చర్యల లోపాలను చూసి పేరెంట్స్ గందరగోళం చెందుతున్నారు. మరోవైపు డెంగీ వ్యాధి తీవ్రత ప్రస్తుతం అధికంగానే ఉన్నది. దీంతో పేరెంట్స్ లో డెంగీ భయం కూడా పట్టుకున్నది.
గతేడాది అనుభవాన్ని పట్టించుకోవట్లే..
గతేడాది పాఠశాలలు ప్రారంభమైన వెంటనే పిల్లల్లో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగింది. అప్పట్లో ఇటు పాఠశాల నుంచి కానీ వైద్యశాఖ నుంచి కానీ చిన్నారులకు ఎలాంటి సహాయం అందలేదు. పైగా కనీసం అవగాహన కార్యక్రమాలు చేయలేదు. దీంతో స్కూళ్లల్లో కేసులు సంఖ్య భారీగా పెరిగింది. ఈ సారి కూడా వైద్యశాఖ అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని స్వయంగా ఆ శాఖలోని కొందరు ఆఫీసర్లు అప్ ది రికార్డులో చెబుతున్నారు.
పిల్లలు మాస్కు ధరించడం ప్రశ్నర్ధాకం..
స్కూళ్లు ప్రారంభమైన తర్వాత మాస్కును మస్ట్ గా ధరించాలని వైద్యశాఖ నిబంధన పెట్టింది. పిల్లల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా మందస్తు జాగ్రత్తతో ఈ నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్కూళ్లకు తేల్చి చెప్పింది. కానీ చిన్నారులు మాస్కులు సమర్ధవంతంగా ధరిస్తారా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇటు వైద్యశాఖ కానీ, విద్యాశాఖలు ఆ దిశగా అవగాహన కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నారు. దీంతో కరోనా నిబంధనలు సక్రమంగా అమలు కాకపోతే పిల్లల్లో కరోనా వ్యాప్తి భారీగా జరిగే అవకాశం ఉన్నట్లు ఓ కీలక అధికారి దిశతో అన్నారు.