విపక్షాలన్నీ ఒక కుటుంబంలాగా.. మోడీ ప్రభుత్వంపై పోరాడుతాయి : Mamata Banerjee

విపక్షాల మీటింగ్‌కు ఒకరోజు ముందే (గురువారం) తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాట్నాకు చేరుకున్నారు.

Update: 2023-06-22 16:30 GMT

పాట్నా : విపక్షాల మీటింగ్‌కు ఒకరోజు ముందే (గురువారం) తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాట్నాకు చేరుకున్నారు. ఇటీవల కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌ను ఆయన నివాసానికి వెళ్లి దీదీ పరామర్శించారు. ఈ సందర్భంగా గౌరవ సూచకంగా లాలూ కాళ్లకు మమత నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఇరువురు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, లాలూ భార్య రబ్రీ దేవీ, బిహార్ ఉపముఖ్యమంత్రి, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. లాలూతో భేటీ అనంతరం దీదీ మీడియాతో మాట్లాడారు. "లాలూ సీనియర్ నాయకుడు. చాలారోజులు జైలులో, హాస్పిటల్‌లో ఆయన ఉండి వచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అకారణంగా ఆయనను జైలుకు పంపింది. సీబీఐ, ఈడీ దాడులతో రాజకీయ కక్షసాధింపు చర్యలకు కేంద్రం పాల్పడుతోంది. లాలూతో భేటీ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ లాలూ ఫిట్‌గా ఉన్నారు. బీజేపీపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు" అని చెప్పారు. ప్రతిపక్షాల సమావేశం గురించి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. "విపక్షాలన్నీ ఒక కుటుంబంలాగా ఏర్పడి ఐక్యంగా మోడీ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తాయి" అని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించి.. దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాల సమావేశం నిర్మాణాత్మకంగా సాగుతుందని ఆశిస్తున్నట్లు మమత వెల్లడించారు.


Similar News