Indian Railways: రైలు ప్రమాదాల్లో కుట్ర కోణం లేదు!
రైలు ప్రమాదాల్లో(Train Accidents) కుట్ర కోణానికి సంబంధించి ఇప్పటి వరకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)కు ఆధారాలేవీ లభించలేదని కొన్ని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
దిశ, నేషనల్ బ్యూరో: రైలు ప్రమాదాల్లో(Train Accidents) కుట్ర కోణానికి సంబంధించి ఇప్పటి వరకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)కు ఆధారాలేవీ లభించలేదని కొన్ని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కనీసం నాలుగు రైలు ప్రమాదాలను ఎన్ఐఏ(National Investigation Agency) దర్యాప్తు చేస్తున్నది. ప్రస్తుతానికి రైలు ప్రమాదాల్లో కుట్ర కోణం(Sabotage) జరిగినట్టు ఆధారాలేవీ లభించలేదు. అయితే, దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది.
‘రైలు ప్రమాదాల్లో కుట్ర కోణం ఉన్నట్టు తమకు ఇది వరకు ఆధారాలు లభించలేదు. కానీ, ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది. నాలుగు రైలు ప్రమాదాలపై ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నాం’ అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి శుక్రవారం వెల్లడించారు. రైలు పట్టాలు తప్పేలా ట్రాక్‌లపై గ్యాస్ సిలిండర్లు, కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప రాడ్లు ఇలా పలు వస్తువులను ఉంచిన ఘటనలు రెండు నెలలుగా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదాలపై ఎన్ఐఏ సహాయాన్ని ఇండియన్ రైల్వేస్ తీసుకున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గత నెలలో పేర్కొన్నారు.