Taiwan: చైనా వ్యతిరేక వ్యాఖ్యలపై తైవాన్ అధ్యక్షుడికి పెరిగిన ప్రజల మద్దతు
దాదాపు 70 శాతం మంది తైవాన్ ప్రజలు వాళ్ల అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థించారు.
దిశ, నేషనల్ బ్యూరో: చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల చైనా వాదనలను తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-తె విమర్శించారు. అక్టోబర్ 10న లై చింగ్-తె తన జాతీయ దినోత్సవ ప్రసంగంలో దేశ భూభాగంలోకి చొరబాటు లేదా ఆక్రమణకు ఎలాంటి ప్రయత్నాలకైనా వ్యతిరేకంగా నిలబడతానని చెప్పారు. దీనికి సంబంధించి తైవాన్‌లోని మెయిన్‌ల్యాండ్ అఫైర్స్ కౌన్సిల్(ఎంఏసీ) గురువారం విడుదల చేసిన సర్వేలో దాదాపు 70 శాతం మంది తైవాన్ ప్రజలు వాళ్ల అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థించారు. నివేదిక ప్రకారం.. ఆయన ప్రసంగం తర్వాత నిర్వహించిన సర్వేలో వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. వారిలో 68.8 శాతం మంది లై చింగ్-తె ప్రకటనకు మద్దతు పలికారు. ఎంఏసీ డిప్యూటీ హెడ్ లియాంగ్ వెన్-చీహ్ మాట్లాడుతూ.. దాదాపు 70 శాతం మంది తైవాన్‌కు ప్రాతినిధ్యం వహించే హక్కు చైనాకు లేదని స్పష్టం చేశారని తెలిపారు. తైవాన్ చుట్టూ చైనా ఇటీవల నిర్వహించిన యుద్ధ విన్యాసాలను 87.3 శాతం మంది నిరాకరించారని సర్వే పేర్కొంది.