ఎన్డీయేకే డిప్యూటీ స్పీకర్ పదవి.. త్వరలోనే ప్రకటించే చాన్స్!
లోక్ సభ స్పీకర్ ఎన్నిక ముగియడంతో ఇక అందరి దృష్టి డిప్యూటీ స్పీకర్ పోస్టు పై పడింది. మోడీ ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా ఖాళీగా ఉన్న ఉప సభాపతి పదవిని ఈసారి భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ స్పీకర్ ఎన్నిక ముగియడంతో ఇక అందరి దృష్టి డిప్యూటీ స్పీకర్ పోస్టు పై పడింది. మోడీ ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా ఖాళీగా ఉన్న ఉప సభాపతి పదవిని ఈసారి భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పోస్టు ప్రతి పక్షాలకు దక్కాలి. కానీ ఈ పదవి కూడా ఎన్డీయే దగ్గరే ఉంచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎన్డీయే మిత్ర పక్షాలైన తెలుగు దేశం పార్టీ(టీడీపీ), జనతాదళ్ యునైటెడ్(జేడీయూ)లకు ఈ పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు వెల్లడించాయి. అయితే టీడీపీ, జేడీయూలు స్పీకర్ పదవి తమకే కావాలని పట్టుబట్టినప్పటికీ బీజేపీ తన వద్దే ఉంచుకుంది. ఈ నేపథ్యంలో వారికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
టీడీపీకే చాన్స్!
డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకే దాదాపుగా వరించనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో అటల్ బిహార్ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి చెందిన జీఎంసీ బాలయోగి స్పీకర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు హరీష్ బాలయోగికే డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు జేడీయూ సైతం ఈ పదవిపై పట్టపడుతున్నట్టు సమాచారం.
కాగా, స్పీకర్ ఎన్నికకు సహకరించాలంటే తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇండియా కూటమి తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. మరోవైపు ప్రొటెం స్పీకర్ ఎన్నికలోనూ సభా నిబంధనలను పాటించలేదని బీజేపీపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ కూడా తమ వద్దే ఉంచుకుంటే ఏ విధంగా ప్రతిస్పందిస్తాయో వేచి చూడాలి.