జార్ఖండ్ సీఎంగా హేమంత్ సొరేన్.. జేఎంఎం శాసనసభా పక్ష భేటీలో నిర్ణయం!

జార్ఖండ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. భూ కుంభకోణం కేసులో అరెస్టై జైలు నుంచి విడుదలైన హేమంత్ సొరేన్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Update: 2024-07-03 13:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. భూ కుంభకోణం కేసులో అరెస్టై జైలు నుంచి విడుదలైన హేమంత్ సొరేన్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. బుధవారం నిర్వహించిన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యేల సమావేశంలో హేమంత్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుత సీఎం చంపయీ సొరేన్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేయనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ రోజు రాత్రి చంపయీ గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేస్తారని పేర్కొన్నాయి. అనంతరం హేమంత్ ప్రమాణ స్వీకారానికి సమయం కోరనున్నట్టు తెలుస్తోంది. అలాగే సీఎం నివాసంలో ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరగగా..దీనిపై వారు కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చంపయీ?

చంపయీ సొరేన్‌ను జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించనున్నట్టు పలు కథనాలు వెల్లడించాయి. దీనిపై కూడా జేఎంఎం మీటింగ్‌లో చర్చ జరిగినట్టు తెలిపాయి. అయితే ఎంతో అనుభవజ్క్షుడైన చంపయీని అవమానించారని ఆయన సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పేర్కొన్నాయి. ఈ పరిణామాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ స్పందించింది. జార్ఖండ్‌లో చంపై సోరెన్ శకం ముగిసిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తెలిపారు. కుటుంబ పార్టీల్లో కొనసాగే వ్యక్తులకు భవిష్యత్ ఉండబోదని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని సూచించారు.

కాగా, జార్ఖండ్ లో మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ హేమంత్ సొరేన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయగా..చంపయీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత నెల 28న హేమంత్ బెయిల్ పై విడుదలయ్యారు. 


Similar News