మేకిన్ ఇండియా : 2023-24లో రూ.1.27 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తులు

దిశ, నేషనల్ బ్యూరో : మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత రక్షణ రంగం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Update: 2024-07-05 18:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత రక్షణ రంగం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 2023 - 2024 ఆర్థిక సంవత్సరంలో మనదేశంలో రూ.1.27 లక్షల కోట్లు విలువైన రక్షణరంగ ఉత్పత్తులు తయారయ్యాయి. ఈవివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో భారత్ సరికొత్త మైలురాయిని అధిగమించిందని మోడీ కొనియాడారు. దీనివల్ల దేశ భద్రత కూడా పెంపొందిందని పేర్కొన్నారు. ప్రపంచ రక్షణ రంగ హబ్‌గా భారత్‌ను మార్చే లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నట్లు ప్రధాని వెల్లడించారు.

20.8 శాతం రక్షణ ఉత్పత్తుల తయారీ ప్రైవేటులోనే..

అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో భారత్ 16.7 శాతం వృద్ధిని సాధించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ‘‘2023-24లో భారత్ తయారు చేసిన రూ.1.27 లక్షల కోట్లు విలువైన రక్షణ ఉత్పత్తుల్లో 79.2 శాతం మేర ప్రభుత్వరంగ కంపెనీల్లో తయారయ్యాయి. మిగతా 20.8 శాతం రక్షణ ఉత్పత్తులను ప్రైవేటు రంగం తయారు చేసింది’’ అని ఆయన వెల్లడించారు.2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.08 లక్షల కోట్లు విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను భారత్ తయారు చేసిందన్నారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధాన సంస్కరణల వల్లే రక్షణ రంగంలో మేకిన్ ఇండియా ఇంతలా సక్సెస్ అయిందని రాజ్‌నాథ్ చెప్పారు.


Similar News