విమాన తయారీ దిగ్గజం బోయింగ్‌ నేరాంగీకారం

దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ విమాన తయారీ కంపెనీ బోయింగ్ తన నేరాన్ని అంగీకరించింది.

Update: 2024-07-08 18:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ విమాన తయారీ కంపెనీ బోయింగ్ తన నేరాన్ని అంగీకరించింది. 2018, 2019 సంవత్సరాల్లో కేవలం ఐదు నెలల వ్యవధిలో ఇండోనేషియా, ఇథియోపియా దేశాలలో బోయింగ్ 737 మ్యాక్స్‌ మోడల్‌కు చెందిన రెండు ప్యాసింజర్ విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో దాదాపు 346 మంది విమాన ప్రయాణికులు చనిపోయారు. దీనిపై అమెరికాలో దర్యాప్తు జరగగా.. తన నేరాన్ని బోయింగ్ కంపెనీ అంగీకరించింది. ఆ రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల సర్టిఫికేషన్స్‌ విషయంలో అమెరికా నియంత్రణ సంస్థలను మోసం చేసినట్లు ఒప్పుకొంది. ఈ వ్యవహారంలో రూ.2వేల కోట్ల జరిమానా కట్టేందుకు బోయింగ్ అంగీకరించింది. తమ కంపెనీ తయారు చేసే విమానాల్లో భద్రతను మెరుగుపర్చేందుకు రూ.3,700 కోట్లను వెచ్చిస్తామని బోయింగ్ హామీ ఇచ్చింది. బోయింగ్ కంపెనీ, అమెరికా న్యాయవిభాగం మధ్య దీనిపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కేవలం ఆ రెండు ఘటనల నుంచి మాత్రమే బోయింగ్‌కు రక్షణ కల్పిస్తుంది. ఈ ఏడాది అలస్కాలో చోటుచేసుకున్న ప్రమాదాల నుంచి ప్రస్తుత, మాజీ బోయింగ్‌ ఉద్యోగులకు గానీ ఎలాంటి రక్షణ ఉండదని అమెరికా న్యాయవిభాగం స్పష్టంచేసింది.


Similar News