Champai Soren: జార్ఖండ్ మాజీ సీఎంకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

జార్ఖండ్ మాజీ సీఎం చంపయి సోరెన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను జంషెడ్ పూర్‌లోని టాటా మెయిన్ ఆస్పత్రికి తరలించారు.

Update: 2024-10-06 14:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ మాజీ సీఎం చంపయి సోరెన్ అస్వస్థతకు గురయ్యారు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి అనారోగ్యానికి గురికావడంతో ఆయనను శనివారం రాత్రి 9 గంటల సమయంలో జంషెడ్ పూర్‌లోని టాటా మెయిన్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, పరిస్థితి మెరుగుపడుతోందని ఆస్పత్రి జీఎం డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు. చంపయికి బ్లడ్ షుగర్‌కు సంబంధించిన సమసమ్యలు ఉన్నట్టు వెల్లడించారు. తన అభిమానులు ఆందోళనకు గురికావడంతో చంపయి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘స్వల్ప అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరాను. ప్రస్తుతం హెల్త్ కండిషన్ బాగానే ఉంది. వీర్ భూమి భోగ్నాడిహ్‌లో నిర్వహించే మాంఝీ పరగణ మహాసమ్మేళన్‌కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతున్నా. త్వరలోనే పూర్తిగా కోలుకుని మీ మధ్యకు వస్తా’ అని పేర్కొన్నారు. కాగా, మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన తర్వాత హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 2న చంపయి జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం హేమంత్ బెయిల్‌పై విడుదలైన తర్వాత చంపయి తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) సభ్యత్వానికి, మంత్రి పదవికి రిజైన్ చేసి బీజేపీలో చేరారు. 


Similar News