Bangladesh: 2021 నుంచి భారత్‌లో అక్రమ నివాసం.. బిహార్‌లో బంగ్లాదేశ్ పౌరుడి అరెస్ట్
పాస్‌పోర్ట్, వీసా లేకుండా 2021 నుంచి భారత్‌లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరుడిని బిహార్‌లో ఆదివారం అరెస్టు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: పాస్‌పోర్ట్, వీసా లేకుండా 2021 నుంచి భారత్‌లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరుడిని బిహార్‌లో ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడిని బంగ్లాదేశ్‌లోని చపైన్‌వాబ్‌గంజ్‌కు చెందిన నవాబ్‌గా గుర్తించారు. అరారియా జిల్లాలోని రాంపూర్ కుదర్‌కట్టి గ్రామంలో నవాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక నివాసుల సహాయంతో ఆయన ఓటరు గుర్తింపు కార్డును పొందడంతో పాటు భారత పాస్‌పోర్టుకు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని పరిశీలించిన అధికారులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి నవాబ్‌ను అరెస్టు చేశారు. అనంతరం విచారించగా మూడేళ్లుగా భారత్‌లో ఉంటున్నట్టు చెప్పాడు. నగర్ నదిని దాటి భారత భూభాగంలోకి చొరబడ్డాడని తెలిపారు. ఏడాదిన్నర క్రితం రంగీలా ఖాటూన్ అనే భారతీయ మహిళను వివాహం చేసుకున్నట్టు వెల్లడించారు. భారత పాస్‌పోర్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు అంగీకరించాడు. నవాబ్‌ను కోర్టులో హాజరుపర్చగా రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ ఘటనతో జిల్లా పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మరోవైపు అంతర్జాతీయ సరిహద్దుల్లో సశాస్త్ర సీమ బల్, సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు నిఘా పెంచారు.