viral: డాక్టర్లు డెత్ డిక్లేర్.. అంత్యక్రియలకు తరలిస్తుండగా స్పీడ్ బ్రేకర్ బతికించింది
చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించిన వ్యక్తిని ఓ స్పీడ్ బ్రేకర్ బతికించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: మరికాసేపట్లో అంత్యక్రియలు చేస్తామనగా చివరి నిమిషాల్లో కళ్ళు తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచే ఘటనలు ఇటీవల అనేక చోట్ల చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇటువంటి ఓ వింత ఘటన మహారాష్ట్రలో (Maharashtra) వైరల్ గా మారింది. చనిపోయాడని వైద్యులు డిక్లేర్ చేసిన ఓ వ్యక్తి శవాన్ని తరలిస్తుండగా రోడ్డు స్పీడ్ బ్రేకర్ అతడికి తిరిగి ప్రాణాలు పోసింది. ఈ వింత ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో చోటు చేసుకుంది. కొల్హాపూర్ (Kolhapur)కు చెందిన పాండురంగ్ (65) గత డిసెంబర్ 16న గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించారని డాక్టర్లు ధ్రువీకరించారు.
దీంతో చేసేదేమీ లేక పాండురంగ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు చేసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు అంతా సిద్ధం అయ్యారు. అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో ఓ స్పీడ్ బ్రేకర్ అడ్డుగా వచ్చింది. అది గమనించకుండా డ్రైవర్ వేగంగా వెళ్లిపోవడంతో వాహనం ఒక్కసారిగా కుదుపునకు (Ambulance Jerk) గురైంది. ఆ కుదుపుతో పాండురంగ్ శరీరంలో మళ్లీ చలనం మొదలైంది. మెళ్లిగా అతడి చేతులు కదపడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అదే వాహనంలో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను రెండు వారాల పాటు ఉండి యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. 15 రోజుల తర్వాత అతడు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకున్నారు. శ్మశానానికి వెళ్లాల్సిన పాండురంగ్ తిరిగి ఇంటికి క్షేమంగా రావడం పట్ల అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆయన మృతి చెందినట్లు ప్రకటించిన ఆసుపత్రి ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు.