డిజిటల్ అరెస్టుల నివారణకు కేంద్రం అడ్వైజరీ

డిజిటల్ అరెస్టు నేరాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ అడ్వైజరీని విడుదల చేసింది. ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలు వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు చేయవని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నేరస్తుల ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.

Update: 2024-10-06 16:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: డిజిటల్ అరెస్టు నేరాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ అడ్వైజరీని విడుదల చేసింది. ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలు వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు చేయవని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నేరస్తుల ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ శనివారం ఈ మేరకు ఓ పబ్లిక్ అడ్వైజరీ విడుదల చేసింది. వాట్సాప్, స్కైప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వీడియో కాల్స్ చేసి డిజిటల్ అరెస్టు స్కామ్‌లు చేస్తున్నారని, నేరస్తుల ట్రాప్‌లో పడొద్దని సూచించింది. ‘ఇలా వీడియో కాల్ చేసి మీరు, లేదా మీ బంధువును, మిత్రుడిని అరెస్టు చేస్తున్నట్టు బెదిరించినప్పుడు భయపడవద్దు. జాగరూకతగా ఉండండి. సీబీఐ, పోలీసు, కస్టమ్, ఈడీ, జడ్జీలు వీడియో కాల్‌లో అరెస్టు చేయరు’ అని పేర్కొంది. అలాంటి నేరాలకు సంబంధించి 1930 నెంబర్‌కు ఫోన్ చేసి లేదా సైబర్ క్రైమ్ వెబ్ సైట్ సందర్శించి రిపోర్ట్ చేయాలని సూచన చేసింది. తమ యూజర్ల భద్రత కోసం తాము ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఇదివరకే వాట్సాప్, స్కైప్‌లు పేర్కొన్నాయి.

డిజిటల్ అరెస్టుల స్కామ్‌లు తరుచూ వెలుగు చూస్తున్నాయి. నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్‌బీసీసీ)కి చెందిన ఓ సీనియర్ అధికారి డిజిటల్ అరెస్టు స్కాంలో రూ. 55 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కాంలో సాధారణంగా నేరస్తులు ఎస్ఎంఎస్ లేదా వీడియో కాల్స్ చేసి తాము ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మిస్తారు. ఆ తర్వాత వారు, లేదా వారి బంధువు ఓ నేరంలో ఇరుక్కున్నారని, వీడియో కాల్‌లోనే వారిని అరెస్టు చేయబోతున్నట్టు చెప్పి బెదిరిస్తారు. అలా చేయకూడదంటే డబ్బులు పంపించాలని డిమాండ్ చేసి మెల్లగా జారుకుంటారు.

Tags:    

Similar News