అమర్‌నాథ్ యాత్రకు వారంలో 1.50 లక్షల మంది

దిశ, నేషనల్ బ్యూరో : కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న పవిత్రమైన అమర్‌నాథ్ గుహలో కొలువైన శివున్ని సందర్శించే భక్తజనం సంఖ్య భారీగా పెరుగుతోంది.

Update: 2024-07-05 18:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న పవిత్రమైన అమర్‌నాథ్ గుహలో కొలువైన శివున్ని సందర్శించే భక్తజనం సంఖ్య భారీగా పెరుగుతోంది. జూన్ 29న అమర్‌నాథ్ తీర్థయాత్ర ప్రారంభం కాగా.. మొదటివారంలో దాదాపు 1.50 లక్షల మంది యాత్రికులు దర్శించుకున్నారు. గత ఏడాది జరిగిన యాత్రలో మొదటి 10 రోజుల్లో లక్ష మంది భక్తులే అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని సందర్శించారు. ఈ లెక్కన ఈసారి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈదఫా 52 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర ఆగస్టు 19న ముగుస్తుంది. యాత్రికులకు సేవ చేయడానికి 125కుపైగా ఉచిత లంగర్లను (కమ్యూనిటీ కిచెన్లు) పలు ధార్మిక సంస్థలు ఏర్పాటు చేశాయి. యాత్రికుల భద్రత కోసం వేలాది మంది పోలీసులు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఇతర పారామిలటరీ బలగాలను మోహరించారు. వాయుసేన బలగాలు వైమానిక నిఘా సంబంధిత సేవలను అందిస్తున్నాయి. గత ఏడాది మొత్తం 4.5 లక్షల మందికిపైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రకు రాగా, ఈ సారి భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.


Similar News