Jay Bhattacharya: ఎన్ఐహెచ్ డైరెక్టర్ గా భారతీయమూలాలున్న జై భట్టాచార్య
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) .. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) .. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈక్రమంలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)కు తదుపరి డైరెక్టర్‌గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్య (Jay Bhattacharya)ను నియమించారు. ఈమేరకు ట్రంప్ ప్రకటనను విడుదల చేశారు. ‘జై భట్టాచార్యను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా నియమించడం ఆనందంగా ఉంది. రాబర్డ్ ఎఫ్ కెన్నడీ జూనియర్ సహకారంతో భట్టాచార్య ఎన్‌ఐహెచ్‌ను నడిపించడంతో పాటు దేశ ప్రజల ప్రాణాలను కాపాడే ముఖ్య ఆవిష్కరణలు చేసేందుకు పనిచేస్తారు. అమెరికా ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు వారిద్దరూ కలిసి కృషి చేస్తారు’ అని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై జై భట్టాచార్య ఆనందం వ్యక్తంచేశారు. ‘తదుపరి ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా అధ్యక్షుడు ట్రంప్ నన్ను నియమించారు. మేము అమెరికన్ శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా మారుస్తాం’ అని ఆయన తెలిపారు.
జై భట్టాచార్య ఎవరంటే..?
ఇక, జై స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఫిజీషియన్, ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చిలో జై అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక స్టాన్‌ఫోర్డ్‌లో ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సెంటర్ ఫర్ డెమోగ్రఫీ అండ్ ఎకనామిక్ ఆఫ్ హెల్త్ అండ్ ఏజినింగ్ డైరెక్టర్‌గానూ ఉన్నారు. కెన్నడీ ఆధ్వర్యంలోని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ (Department of Health and Human Services) ట్రంప్ కార్యవర్గానికి ఎంతో కీలకమైంది. ఇది అమెరికాలో వైద్య సేవలను చూసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 50 బిలియన్ డాలర్ల విలువైన ఎన్ఐహెచ్ సంస్థ అమెరికా బయోమెడికల్ రీసెర్చిని పర్యవేక్షిస్తుంది. ఇతర ఏజెన్సీలతో కలిసి ఇది అమెరికా హెల్త్ డిపార్ట్ మెంట్ విభాగం కింద పనిచేస్తుంది.