ఖైదీకి వైద్యం నిరాకరణ..మణిపూర్ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మైనారిటీ హోదా కారణంగా అండర్ ట్రయల్ ఖైదీకి వైద్యం అందించనందుకు మణిపూర్ రాష్ట్ర అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-07-03 13:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మైనారిటీ హోదా కారణంగా అండర్ ట్రయల్ ఖైదీకి వైద్యం అందించనందుకు మణిపూర్ రాష్ట్ర అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫైల్స్, క్షయ వ్యాధి, తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న లుంఖోంగమ్ హాకిప్ అనే కుకీ వర్గానికి చెందిన ఖైదీని అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

హకీప్ వైద్య అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని బెంచ్ వ్యాఖ్యానించింది. తక్షణమే హకీప్‌కు వైద్యం అందించాలని ఆదేశించింది. ‘నిందితుడు కుకీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. ఇది చాలా బాధాకరం. అతనికి ఇప్పుడు పరీక్షలు చేపట్టండి. మెడికల్ పరీక్షలో ఏదైనా సమస్య సీరియస్‌గా తేలితే ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. గౌహతి మెడికల్ కళాశాలలో ఖైదీకి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, మణిపూర్ జైలు సూపరిడెంటెంట్ కు బెంచ్ ఆర్డర్స్ జారీ చేసింది. ఈ నెల 15లోగా హకీప్ మెడికల్ రిపోర్ట్‌ను అందజేయాలని సూచించింది. 


Similar News