ఉచితాలపై సుప్రీం సంచలన తీర్పు.. మహారాష్ట్ర సర్కార్ పై ఆగ్రహం

ఉచితాల పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారూ కాని అవసరమైన చోట వాడటం లేదంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-08-14 16:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉచితాల పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారు కాని అవసరమైన చోట వాడటం లేదంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ భూవివాదానికి సంబంధించి పరిహారం కల్పించే అంశంపై ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది భారత సర్వోన్నత న్యాయస్థానం. మహారాష్ట్రలో ఆరు దశాబ్దాల క్రితం ఆక్రమణకు గురైన ఓ భూవివాదంపై బుధవారం వాదనలు కొనసాగాయి. ఈ క్రమంలో రూ.317 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని పిటిషనర్ కోరగా కేవలం రూ.37 కోట్లు మాత్రమే చెల్లిస్తామంటూ ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనిపై స్పందించిన కోర్ట్.. 'ప్రభుత్వ ఖజానా నుండి ఉచితాల కోసం వృథా చేసేందుకు రూ.వేల కోట్లు ఉంటాయి కానీ, చట్ట ప్రకారం కాకుండా అక్రమంగా లాక్కున్న భూమికి పరిహారం ఇచ్చేందుకు డబ్బులు ఉండవు' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తాము ఆశించిన మేరకు లేవు, ఇటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవాలి అంటే ప్రభుత్వానికి 24 గంటల సమయం చాలు. అయినప్పటికీ సరైన పరిహారం పిటిషనర్ కు ఇవ్వాలని ప్రభుత్వానికి మూడు వారాల గడువు ఇస్తున్నాం. ఒకవేళ అప్పటికీ సరైన నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్రంలో అన్ని ఉచిత పథకాలను నిలిపి వేస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణ ఆగస్టు 28కి కోర్ట్ వాయిదా వేసింది.      


Similar News