Rakesh tikait: సోయాబీన్ పంటకు ఎంఎస్‌పీ పెంచాలి.. బీకేయూ నేత రాకేశ్ టికాయత్ డిమాండ్

సోయాబీన్‌కు కనీస మద్దతు ధర పెంచాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు.

Update: 2024-09-23 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సోయాబీన్‌కు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ట్రాక్టర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రాకేశ్ ప్రసంగిస్తూ.. సోయాబీన్ పంటకు ఎంఎస్‌పీని క్వింటాల్‌కు రూ.4892 నుంచి రూ.6వేలకు పెంచాలని తెలిపారు. ఈ విషయంపై రైతులు గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏ రాజకీయ పార్టీని కూడా వేదికపైకి రానివ్వొద్దని సూచించారు. ఢిల్లీలో రైతుల నిరసన 13 నెలల పాటు కొనసాగిందని, నిరసనలతో ఎవరికీ ఇబ్బంది ఉండబోదన్నారు. రైతులు నష్టపోతే దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తారని చెప్పారు. జాతిని రక్షించడానికే రైతులు నిరంతరం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ప్రస్తుతం ఉన్న ఎంఎస్‌పీ రేటుతో రైతులు తమ పెట్టుబడిని కూడా తిరిగి పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్‌పీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న రైతుల డిమాండ్లను రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.  


Similar News