Nirmala Sitharaman : యువ సీఏ సూసైడ్‌పై ఆర్థిక మంత్రి నిర్మల కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : అధిక పనిభారంతో ఓ ప్రముఖ కంపెనీలో సీఏగా పనిచేసే యువతి సూసైడ్ చేసుకున్న వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.

Update: 2024-09-23 13:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అధిక పనిభారంతో ఓ ప్రముఖ కంపెనీలో సీఏగా పనిచేసే యువతి సూసైడ్ చేసుకున్న వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. విద్యార్థులకు చదువుతో పాటు పని ఒత్తిడిని జయించడం గురించి విద్యా సంస్థలు బోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగం సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయడంతో విద్యాసంస్థల బాధ్యత ముగియదని ఆమె పేర్కొన్నారు. చెన్నైలోని ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దైవత్వాన్ని నమ్ముకుంటే పని ఒత్తిడిని జయించొచ్చు. దేవుడి మీద నమ్మకం ఉంచితే ఆత్మశక్తి పెరుగుతుంది. తద్వారా మనోబలం సమకూరుతుంది’’ అని ఆమె తెలిపారు. విద్యా సంస్థలు దైవత్వాన్ని, ఆధ్యాత్మికతను బోధిస్తే పిల్లలు మనోబలంతో వృద్ధిలోకి వస్తారన్నారు.

సీఏ చదివిన ఓ యువతి పని ఒత్తిడిని తాళలేక మరణించారన్న వార్త తనను కలచి వేసిందని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు. అయితే సదరు కంపెనీ పేరును గానీ, ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగి పేరును కానీ ఆమె ప్రస్తావించలేదు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను విపక్ష నేతలు తప్పుపట్టారు. కార్పొరేట్లకు ఇబ్బంది వచ్చినప్పుడే ఆర్థిక మంత్రి పట్టించుకుంటారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. సూసైడ్ చేసుకున్న అన్నా సెబాస్టియన్‌‌కు అండగా నిలవాల్సింది పోయి.. ఆమెదే తప్పు అన్నట్టుగా నిర్మల మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు. పని విధానం, సుదీర్ఘ పని గంటలు వంటి అంశాల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడకపోవడం సరికాదని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.


Similar News