Haryana elections: హర్యానాలో క్లీన్ స్వీప్ చేస్తాం.. కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా దీమా వ్యక్తం చేశారు.

Update: 2024-09-23 13:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రణదీప్ సూర్జేవాలా దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వ లోపంతో బాధపడుతోందని విమర్శించారు. హర్యానాలోని కైతాల్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని 90 సీట్లకు గాను 2005లో కాంగ్రెస్ 67 స్థానాలు కైవసం చేసుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం సైతం అదే సీన్ రిపీట్ అవుతుందని నొక్కి చెప్పారు. ప్రజలు బీజేపీని తరిమికొట్టాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారన్నారు. కాంగ్రెస్ వైపే రాష్ట్ర ప్రజలంతా ఉన్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆరోపించారు. సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి అధిష్టానం ఖరారు చేస్తుందని తెలిపారు. కాగా, హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా, అదే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 89 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మరొక స్థానాన్ని సీపీఎంకు అప్పగించింది. 


Similar News