Nitish kumar: నితీశ్ కుమార్‌కు భారత రత్న ఇవ్వాలి.. బిహార్‌లో వెలసిన పోస్టర్లు
బిహార్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్‌కు భారత రత్నఇవ్వాలని పోస్టర్లు వెలిశాయి.
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) చీఫ్ నితీశ్ కుమార్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాట్నాలో పోస్టర్లు వెలిశాయి. ఆయన పార్టీ శ్రేణులే ఈ పోస్టర్లు వేశారు. పాట్నాలోని వివిధ కూడళ్లలో, సీఎం నివాసం, జేడీయూ కార్యాలయాల్లో శనివారం వీటిని ఏర్పాటు చేశారు. బిహార్‌కు చెందిన ప్రముఖ సోషలిస్టు, అభివృద్ధి వేత్త గౌరవనీయులైన సీఎం నితీశ్‌కు భారతరత్న ఇవ్వాలని పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ పోస్టర్‌ను జేడీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఛోటూ సింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముందు పోస్టర్లు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశానికి వచ్చే వారికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన జేడీయూ పోస్టర్ల దగ్గర భారత రత్న ఇవ్వాలనే పోస్టర్లు వేశారు.
అయితే భారత రత్న ఇవ్వాలని జేడీయూ అధికారికంగా డిమాండ్ చేయడం లేదని, కానీ భారతరత్న ఇవ్వడానికి నితీశ్ అన్ని విధాలా అర్హుడని పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు తెలిపారు. ప్రతి జేడీయూ కార్యకర్త దీనిని విశ్వసిస్తున్నారని చెప్పారు. పంచాయతీరాజ్ సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్, రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించే సాహసోపేతమైన చర్యలు నితీశ్ తీసుకున్నారని కొనియాడారు. ఈ పోస్టర్లపై పాట్నాలో రాజకీయ రగడ మొదలైంది. ఈ పరిణామంపై రాష్ట్రీయ జనతాదళ్ వ్యంగ్యంగా స్పందించింది. బిహార్‌లో పడిపోయిన వంతెనలు, కల్వర్టులకు గాను ఆయనకు గౌరవం ఇవ్వాలని పేర్కొంది. కాగా, బిహార్ లో నితీశ్ కుమార్ అత్యధిక కాలం పని చేసిన సీఎంగా నిలిచారు.