PM Modi : కువైట్ ‘మినీ హిందుస్తాన్’లా కనిపిస్తోంది.. ‘హలా మోడీ’లో ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : కువైట్(Kuwait)లో ఇంతమంది భారతీయులను చూస్తుంటే.. ఇదొక మినీ హిందుస్తాన్‌లా కనిపిస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : కువైట్(Kuwait)లో ఇంతమంది భారతీయులను చూస్తుంటే.. ఇదొక మినీ హిందుస్తాన్‌లా కనిపిస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) అన్నారు. ‘‘మీ అందరికీ భారత్(India) నుంచి ఇక్కడికి రావడానికి 4 గంటల టైమే పట్టింది. కానీ ఒక భారత ప్రధానిగా నేను ఇక్కడికి రావడానికి ఏకంగా 4 దశాబ్దాల టైం పట్టింది’’ అని ఆయన పేర్కొన్నారు. 43 ఏళ్ల తర్వాత కువైట్ పర్యటనకు భారత ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. రెండు రోజుల కువైట్ పర్యటనకు వెళ్లిన మోడీ.. అక్కడి ప్రవాస భారతీయులతో నిర్వహించిన ‘హలా మోడీ’ కార్యక్రమంలో ప్రసంగించారు. కువైట్ మెడికల్ అండ్ హెల్త్ రంగానికి భారతీయ వైద్యులు, పారామెడికోలే ప్రధాన బలమన్నారు. కువైట్ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో భారతీయ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారిందని మోడీ చెప్పారు. విదేశీ కరెన్సీని స్వీకరించే విషయంలో భారత్ అగ్రగామిగా నిలవడానికి ప్రవాస భారతీయులే ప్రధాన కారణమన్నారు. కువైట్, భారత్‌లను దౌత్యసంబంధాలతో పాటు హృదయ సంబంధాలు కూడా దగ్గర చేస్తున్నాయని తెలిపారు. నవ్య కువైట్‌కు అవసరమైన మానవ వనరులు, నైపుణ్యత, సాంకేతికతను అందించే విషయంలో భారత్ ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలుస్తుందని మోడీ వెల్లడించారు. భారతదేశంలోని స్టార్టప్‌లు కువైట్ అవసరాలకు అత్యాధునిక పరిష్కారాలను చూపించగలవన్నారు. కరోనా సంక్షోభ సమయంలో భారత్‌కు లిక్విడ్ ఆక్సిజన్‌ను సరఫరా చేసిన కువైట్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా భారత ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
నటుడు దిలీప్ కుమార్ తొలి భారతీయ రెస్టారెంట్..
‘‘కువైట్‌కు స్వాతంత్య్రం వచ్చిన వెంటనే గుర్తించిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. కువైట్‌లో తొలి భారతీయ రెస్టారెంట్‌ను ప్రఖ్యాత నటుడు దిలీప్ కుమారే ఏర్పాటు చేశారు. ప్రవాస భారతీయులు కువైటీ ఫ్రెండ్స్‌ను భారత్‌కు తీసుకొచ్చి.. వారికి భారతీయ ఆహార రుచులను చూపించాలి’’ అని మోడీ పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచ ప్రజల ఆరోగ్యాల పరిరక్షణలో ఆయుర్వేదం కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌కు చెందిన ఆయుర్వేద, ఆయుష్ ఉత్పత్తులు ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి’’ అని భారత ప్రధాని చెప్పారు. ‘‘నాటి నలంద నుంచి నేటి ఐఐటీల వరకు భారత్ ఏర్పాటు చేసిన నాలెడ్జ్ సిస్టమ్ యావత్ ప్రపంచానికి ఎన్నో రకాలుగా దోహదం చేసింది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘గతేడాది భారత్‌లో జీ20 సదస్సు జరిగిన సందర్భంగా భారత్-మిడిల్ ఈస్ట్ - యూరోప్ ఎకానమిక్ కారిడార్‌ను ప్రకటించాం. అది ప్రపంచానికి కొత్త దిశను చూపించబోతోంది’’ అని మోడీ తెలిపారు. ప్రవాస భారతీయులతో సమావేశం ముగిసిన అనంతరం కువైట్ సిటీలో మాజీ ఐఎఫ్ఎస్ అధికారి 101 ఏళ్ల మంగళ్ సేన్ హండాను ప్రధాని మోడీ కలిశారు.
అరబిక్ భాషలోకి రామాయణం, మహాభారతం..
రామాయణం, మహాభారతాలను అరబిక్ భాషలోకి అనువదించిన అబ్దుల్లా అల్ బరూన్, అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్‌లను ఈసందర్భంగా ప్రధాని మోడీ కలిశారు. ఈసందర్భంగా రామాయణం, మహాభారతం అరబిక్ ప్రతులను వారిద్దరూ భారత ప్రధానికి బహూకరించారు. హిందువులకు అత్యంత పవిత్రమైన ఈ రెండు గ్రంథాలను అరబిక్ భాషలో చూస్తున్నందుకు సంతోషంగా ఉందని మోడీ తెలిపారు. వీటిని అరబిక్ భాషలోకి అనువదించడంలో కీలక పాత్ర పోషించిన అబ్దుల్లా అల్ బరూన్, అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్‌లను అభినందించారు. భారత కల్చర్‌కు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణకు ఈ ఇద్దరి చొరవే నిదర్శనమన్నారు. కాగా, కువైట్ రాజు షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబా ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు మోడీ వెళ్లారు.