Maharashtra: మహారాష్ట్రలో పోర్ట్ ఫోలియోల కేటాయింపు.. షిండేకు మరోసారి నిరాశ?

మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో ఎట్టకేలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రులకు శాఖలు కేటాయించారు.

Update: 2024-12-21 17:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో ఎట్టకేలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలకమైన హోం మంత్రిత్వ శాఖ సహా ఇంధనం, న్యాయవ్యవస్థ, సాధారణ పరిపాలన శాఖ, సమాచార, ప్రచార శాఖలను ఫడ్నవీస్ తన వద్దే ఉంచుకోగా.. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే(Eknath shinde)కు పట్టణాభివృద్ధి, హౌసింగ్, పబ్లిక్ వర్క్స్ (ఎంటర్ ప్రైజెస్).. మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌(Ajith pawar)కు ఫైనాన్స్, ప్లానింగ్, ఎక్సైజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్ర శేఖర్ భవాన్‌కులేకు రెవెన్యూ శాఖ కేటాయించారు. ఇక, శివసేనకు చెందిన సీనియర్ నేత దాదాజీ భూసేకు పాఠశాల విద్య, మరో నేత ఉదయ్ సమంత్ పరిశ్రమల శాఖ, మరాఠీ భాషా మంత్రిగా నియామకమయ్యారు. చంద్రకాంత్ బచ్చు పాటిల్‌కు ఉన్నత, సాంకేతిక విద్య, అసెంబ్లీ వ్యవహారాలు, అలాగే అదితి తత్కరేకు మహిళా శిశు అభివృద్ధి శాఖలు కేటాయించారు. మాణిక్ రావ్ సరస్వతీ శివాజీ కోకటేకు వ్యవసాయ శాఖ దక్కింది.

బీజేపీ వద్దే కీలక శాఖలు

మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన ఎన్సీపీలు భాగస్వామ్యంగా ఉండగా కీలక శాఖలైన హోం, ఉన్నత విద్య, ఇంధనం, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, అటవీ, పర్యావరణ శాఖలను కాషాయపార్టీ తన వద్దే ఉంచుకుంది. ఎన్సీపీకి ఆర్థిక, ప్రణాళిక, సహకారం, వ్యవసాయం వంటి శాఖలను కేటాయించింది. కాగా, ఈ నెల 15న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగగా 39 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో బీజేపీ19, శివసేన 11, ఎన్సీపీ నుంచి 9 మంది ఉన్నారు.

షిండేకు మరోసారి నిరాశ?

శివసేన చీఫ్ ఏక్ నాథ్ షిండేకు మరోసారి నిరాశే ఎదురైంది. ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం పదవి కోసం పట్టుబట్టినా ఆ పదవి దక్కలేదు. అనంతరం ఆయన కీలకమైన హోం శాఖను ఆశించారు. ఆయన సన్నిహితులు, పలు మీడియా కథనాలు సైతం హోం మంత్రిత్వ శాఖ షిండే వద్దే ఉంటుందని వెల్లడించాయి. అయితే హోం శాఖను ఫడ్నవీస్ తన వద్దు ఉంచుకోవడంతో షిండేకు మరోసారి నిరాశే మిగిలింది.

Tags:    

Similar News