Pakistan: పాక్‌లో మరో ఉగ్రదాడి.. 16 మంది సైనికులు మృతి !
పాకిస్థాన్‌లో మరో ఉగ్రదాడి జరిగింది. ఖైబర్ ఫంఖ్తుంఖ్వా ప్రావీన్స్ లోని ఆర్మీ చెక్ పోస్టుపై దాడి చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ (Pakisthan)లో మరో ఉగ్రదాడి జరిగింది. ఆప్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఖైబర్ ఫంఖ్తుంఖ్వా ప్రావీన్స్(Khyber Pakhtunkhwa province) లోని ఆర్మీ చెక్ పోస్టుపై తాలిబన్ టెర్రరిస్టులు శనివారం దాడి చేశారు. ఈ ఘటనలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా..మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 30 మంది ఉగ్రవాదులు చెక్ పోస్టును ముట్టడించారని రెండు గంటల పాటు భీకర దాడులకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. చెక్‌పాయింట్‌లో ఉన్న వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరాలు, పత్రాలు, ఇతర వస్తువులను సైతం తగులబెట్టినట్టు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. సరోఘా (Sarogha) ప్రాంతంలో జరిపిన రహస్య ఆపరేషన్‌లో పాక్ భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన కొద్ది రోజుల తర్వాత ఈ దాడి జరిగింది. అయితే తమ కమాండర్ల హత్యకు ప్రతీకారంగానే తాజాగా దాడి చేశామని పాక్ తాలిబన్ విభాగం తెలిపింది. ఈ ఘటనను పాక్ సైన్యం అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా, ఖైబర్ ఫంఖ్తుంఖ్వా ప్రావీన్స్‌లో ఇటీవల ఉగ్రవాద ఘటనలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.