Amith shah: ఈశాన్య పోలీసుల విధానంలో మార్పు అవసరం.. కేంద్ర మంత్రి అమిత్ షా
ఈశాన్య రాష్ట్రాల పోలీసులు తమ విధానాలు మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెంట్ల సమస్య దాదాపు అంతమైందని, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల పోలీసులు తమ విధానాలు మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith shah) అన్నారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా, వారి హక్కులను పొందేలా పోలీసులు దృష్టి సారించాలని సూచించారు. త్రిపుర (Tripura) రాజధాని అగర్తలా (Agarthala)లో శనివారం జరిగిన నార్త్ ఈస్ట్ కౌన్సిల్ 72వ ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. నాలుగు దశాబ్దాలుగా ఈశాన్య పోలీసులు దృష్టంతా తిరుగుబాటుపైనే ఉందని, ప్రస్తుతం ఆ ప్రాబ్లం కొలిక్కివచ్చినందున ప్రజల రక్షణపై దృష్టిపెట్టాలన్నారు. గత పదేళ్లలో 20 శాంతి ఒప్పందాలు జరిగాయని, ఇది ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పేందుకు ఎంతో దోహదపడిందని తెలిపారు. శాంతి ఒప్పందాల కారణంగా10,574 మంది సాయుధ మిలిటెంట్లు లొంగిపోయారని గుర్తు చేశారు. నూతన క్రిమినల్ చట్టాలతో పౌరులందరికీ సత్వర న్యాయం జరుగుతోందన్నారు.
ఈశాన్య ప్రాంతంలో రైలు కనెక్టివిటీకి కేంద్రం రూ.81,000 కోట్లు, రోడ్ నెట్‌వర్క్ కోసం రూ.41,000 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. అంతేగాక ఈ ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. ‘ కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ (Nasha mukth barath abhiyan) ను ప్రారంభించింది. దీనిపై ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక బాధ్యత ఉంది. ఈ ప్రాంతం నార్కోటిక్-స్మగ్లింగ్‌కు రవాణా మార్గం. ఈ మచ్చను తొలగించేందుకు గవర్నర్లు, సీఎంలు సహకరించాలి. భారత్‌ను నషా-ముక్త్‌గా మార్చేందుకు కష్టపడాలి. ఈ దిశగా ఈశాన్య రాష్ట్రాలు కృషి చేయాలి’ అని తెలిపారు.