Nagpur violence: నాగ్‌పూర్‌లో కర్ఫ్యూ..50 మంది అరెస్ట్
ఔరంగజేబు దిష్టిబొమ్మ దహనం సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్‌లో హింస చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఔరంగజేబు దిష్టిబొమ్మ దహనం సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్(Nagpur)లో హింస చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నాగ్‌పూర్‌లోని11 ప్రాంతాల్లో మంగళవారం కర్ఫ్యూ విధించారు. హింసాత్మక ఘటనల అనంతరం 50 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియా పోస్టులతో పుకార్లు వ్యాపించజేసిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియలో ఉన్నామని నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు. హింస సందర్భంగా 33 మంది పోలీసులు గాయపడ్డట్టు వెల్లడించారు. ఐదుగురు పౌరులకు సైతం తీవ్ర గాయాలైనట్టు పేర్కొన్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో శంభాజీనగర్‌లోని ఔరంగాజేబు సమాధి వద్ద భద్రతను పెంచారు. అటువైపుగా వెళ్లే రహదారులను మూసివేశారు. ముంబైలోనూ భారీగా బలగాలను మోహరించారు.
ప్రజల ఆగ్రహానికి చావా సినిమానే కారణం: సీఎం ఫడ్నవీస్
నాగ్‌పూర్‌లో నెలకొన్న మత హింస ముందస్తు ప్రణాళికతోనే జరిగిన కుట్రగా కనిపిస్తోందని, ఆందోళనకారుల గుంపు నిర్దిష్ట ఇళ్లు, సంస్థలను లక్ష్యంగా చేసుకుందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra fadnavis) తెలిపారు. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడినట్టు అనుమానం కలుగుతుందన్నారు. పోలీసు అధికారులపై దాడికి పాల్పడిన వారికి విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చావా సినిమా మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్రను తెరపైకి తెచ్చిందని దీంతో ప్రజలు మనోభావాలు రగిలిపోయాయాయని తెలిపారు. తద్వారా ఔరంగజేబుపై ప్రజల ఆగ్రహం తెరపైకి వస్తోందని ఆరోపించారు. ప్రజలు శాంతిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు నాగ్‌పూర్‌లో హింసలో పాల్గొన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
మహారాష్ట్రను మణిపూర్‌గా మారుస్తారా: ఆదిత్య థాక్రే
నాగ్‌పూర్ హింసపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాక్రే (Aaditya Thackrey) స్పందించారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ మహారాష్ట్రను ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. హింసకు సంబంధించిన పుకార్లు వ్యాపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హోం శాఖ వద్ద ఎలాంటి నివేదికలు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అలాగే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు సైతం బీజేపీపై విమర్శలు గుప్పించాయి.