Deportation: త్వరలోనే అమెరికా నుంచి భారత్ కు రానున్న 295 మంది భారతీయులు
అమెరికా నుంచి త్వరలోనే మరో 295 మంది భారతీయులు(Indian Migrants) వెనక్కి(Deportation) రానున్నారు. ఈ మేరకు అక్రమవలసలపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ(MEA) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నుంచి త్వరలోనే మరో 295 మంది భారతీయులు(Indian Migrants) వెనక్కి(Deportation) రానున్నారు. ఈ మేరకు అక్రమవలసలపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ(MEA) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. అంతేకాకుండా, భారత్ కు పంపించిన వలసదారుల పట్ల అమెరికా అధికారుల తీరుపై కేంద్రం స్పందించింది. ఈ విషయాన్ని వాషింగ్టన్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. ‘‘భారత్ ఆందోళనల తర్వాత ఫిబ్రవరి 15, 16 తేదీల్లో పంపించిన వలసదారుల్లో మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదని అమెరికా ధ్రువీకరించింది. వలసదారులు స్వదేశానికి చేరుకున్న తర్వాత వారితో చర్చించి మన అధికారులు కూడా ఈ విషయంపై క్లారిటీ తీసుకున్నారు. అయితే, అమెరికాలో చట్టవ్యతిరేకంగా నివాసం ఉంటున్న వారిలో మరో 295 మంది భారతీయులు త్వరలోనే స్వదేశానికి రానున్నారు. ప్రస్తుతం సంబంధిత ఏజెన్సీలు వారి వివరాలను పరిశీలిస్తున్నాయి’’ అని విదేశాంగశాఖ తమ సమాధానంలో పేర్కొంది.
ఇప్పటికే 388 మంది వెనక్కి..
అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసపై దృష్టి సారించారు. కాగా.. ఇప్పటికే విడత వారీగా అక్రమవలసదారులను భారత్ కు వెనక్కి పంపారు. ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటివరకూ 388 మంది భారత అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో అగ్రరాజ్యం వెనక్కి పంపింది. వీరిలో అత్యధికంగా 40శాతం మంది పంజాబ్ వాసులు కాగా.. 34శాతం హర్యానాకు చెందినవారే ఉన్నారు. అయితే, వీరికి వెనక్కి పంపించేటప్పుడు చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి బంధించి పంపడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కేంద్రం కూడా స్పందించింది. ఈ విషయాన్ని అగ్రరాజ్యం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది. ఇకపోతే, డిపోర్టేషన్ ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభం అయ్యింది కాదు. 2009 నుంచి 2024 వరకు దాదాపు 15,500 మందిని అమెరికా వెనక్కి పంపించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ గుర్తుచేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (2017-2021) పదవీకాలంలో అమెరికా 6,000 మందికి పైగా భారతీయులను వెనక్కి పంపిందని వెల్లడించింది. కాగా.. జోబైడెన్ పదవీ కాలంలో కేవలం 3000 మందిని మాత్రమే వెనక్కి పంపినట్లు తెలిపింది. విదేశాంగ శాఖ డేటా ప్రకారం 2017-2021 మధ్య 6,135 మంది భారతీయులను అమెరికా నుండి బహిష్కరించారు. అత్యధికంగా 2019లో 2,042 మందిని వెనక్కి పంపారు. 2017లో 1,024 మంది భారతీయులను.. 2018లో 1,180 మందిని.. 2020లో 1,889 మందిని తిరిగి పంపించారు.