Jnanpith Award: హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డ్
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా 59వ జ్ఞానపీఠ్ అవార్డ్‌కు ఎంపికయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా (Vinod kumar Shukla) 59వ జ్ఞానపీఠ్ అవార్డ్ (Jnanpith Award) కు ఎంపికయ్యారు. ఈ మేరకు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రతిభా రే అధ్యక్షతన శనివారం జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి రచయితగా వినోద్ ఘనత సాధించారు. అంతేగాక 12వ హిందీ రచయితగా నిలిచారు. హిందీ లిటరేచర్, సృజనాత్మకత, విలక్షణమైన రచనా శైలికి గాను ఆయన వినోద్ చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని ప్రధానం చేస్తున్నట్టు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. శుక్లా ప్రసిద్ధ నవల ’నౌకర్ కీ కమీజ్’ కు ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్టు తెలిపింది.
వినోద్ కుమార్ శుక్లా 1937 జనవరి 1న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్ గావ్ లో జన్మించారు. నాగ్ పూర్‌లో ఉన్నత విద్యను పూర్తి చేసిన శుక్లా అనేక రచనలు చేశారు. ఆయన రచనలు మానవ భావోద్వేగాలను, గ్రామీణ జీవితాన్ని, సామాజిక నిర్మాణాలే లక్ష్యంగా ఉంటాయి. మొదటి కవితా సంకలనం ‘అభిష్ జై హింద్ పేరుతో’ 1971లో ప్రచురితమైంది. అప్పటి నుంచి హిందీ సాహిత్యంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాసిన ‘నౌకర్ కి కమీజ్’, ‘ఖిలేగా తో దేఖేంగే’, ‘దేర్ యూజ్డ్ బి ఎ విండో ఇన్ ది వాల్’ అనేవి ఉత్తమ నవలలుగా పరిగణించబడ్డాయి. ‘దేర్ యూజ్డ్ టు బి ఎ విండో ఇన్ ది వాల్’ నవలకు 1999లో సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. ఇటీవలే మాతృభూమి బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది.
కాగా, జ్ఞానపీఠ్ అవార్డు అనేది భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారం. రాజ్యాంగంలో పొందుపర్చబడిన 22 భాషల్లో రచనలు చేసే భారత పౌరులు ఈ అవార్డుకు అర్హులు. ఈ అవార్డు కింత రూ.22లక్షలతో పాటు ప్రశంసా పత్రం, సరస్వతీ దేవీ కాంస్య విగ్రహం అందజేస్తారు. మొదటి జ్ఞానపీఠ్ అవార్డును 1965లో మలయాళ రచయిత శంకర్ కురూప్‌కు ప్రదానం చేశారు. ఒడక్కుళల్ అనే సంకలనానికి గాను ఆయనకు అవార్డు దక్కింది.