Sudan : రెండేళ్ల తర్వాత సూడాన్ అధ్యక్ష భవనం స్వాధీనం
సూడాన్ లో రెండేళ్ల క్రితం అంతర్యుద్ధం ప్రారంభమైంది. 2023 నుండి సుడాన్ లో అంతర్యుద్ధం జరుగుతోంది. సూడాన్ (Sudan)పై పట్టు కోసం సైన్యం (Army), పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) మధ్య యుద్ధం కొనసాగుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: సూడాన్ లో రెండేళ్ల క్రితం అంతర్యుద్ధం ప్రారంభమైంది. 2023 నుండి సుడాన్ లో అంతర్యుద్ధం జరుగుతోంది. సూడాన్ (Sudan)పై పట్టు కోసం సైన్యం (Army), పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) మధ్య యుద్ధం కొనసాగుతోంది. కాగా.. దాదాపు రెండేళ్ల తర్వాత సూడాన్ సైన్యం ఖార్టూమ్ లోని అధ్యక్ష భవనాన్ని ర్యాపిడ్ ఫోర్స్ నుంచి స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. అయితే, ఆర్ఎస్ఎఫ్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దాదాపు రెండేళ్ల క్రితం సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో భయంకరమైన అంతర్యుద్ధం మొదలైంది. దీంతో ఆ నగరంలోని చాలా ప్రాంతాలను ఆర్‌ఎస్ఎఫ్ అధీనంలోకి తీసుకొంది. అయితే, ఈ ప్రదేశంపై పట్టు సాధించడంతో సైన్యానికి గొప్ప విజయం దక్కింది. మరోవైపు మధ్య సూడాన్ ప్రాంతాల్లో ఆర్మీ పట్టు సాధిస్తోంది. సూడాన్‌లోని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన.. రెండు బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈవిషయమై సైన్యాధినేత అబ్దుల్ ఫతాఅల్ బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా నెలకొన్న విభేదాలు.. తీవ్రస్థాయికి చేరడంతో అంతర్యుద్ధం మొదలైంది. ఆ తర్వాత అధ్యక్ష భవనం, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి వాటిని ఆర్‌ఎస్‌ఎఫ్ అధీనంలోకి తీసుకొంది. ఇక ఈ యుద్ధాన్ని ఆపేందుకు యత్నించిన ఐక్యరాజ్యసంస్థ సహా పలు స్వచ్ఛంద సంస్థలను కూడా దేశం వీడేలా చేశారు.