నాసా వ్యోమగాములకు ట్రంప్ భరోసా
వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యోమగాములకు అదనపు జీతం లభిస్తుందా అని ట్రంప్‌ను ప్రశ్నించారు.

- 9 నెలల పాటు ఐఎస్ఎస్‌లో చిక్కుకున్న ఆస్ట్రనాట్స్
- సునీత, బుచ్ విల్మోర్‌కు దక్కని అదనపు ప్రయోజనాలు
- తానే స్వయంగా చెల్లిస్తానని చెప్పిన ట్రంప్
దిశ, నేషనల్ బ్యూరో: నాసా వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకొని ఇటీవలే తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. వారం రోజుల పర్యటనకు వెళ్లి.. సాంకేతిక లోపం కారణంగా వారు వెళ్లిన స్పేస్ క్రూజ్ షిప్ ఖాళీగానే తిరిగి వచ్చింది. అప్పటి నుంచి 278 రోజుల పాటు అంతరిక్షంలోనే గడిపారు. అయితే వారు అక్కడ అదనంగా గడిపిన కాలానికి నాసా పాలసీ ప్రకారం ఎలాంటి డబ్బు చెల్లించదు. కానీ రోజుకు రూ.430 మాత్రం డీఏగా పొందుతారని నాసా తెలిపింది. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు ఐఎస్ఎస్‌లో గడిపిన అదనపు సమయానికి తన సొంత జేబు నుంచి చెల్లిస్తానని చెప్పారు.
వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యోమగాములకు అదనపు జీతం లభిస్తుందా అని ట్రంప్‌ను ప్రశ్నించారు. కాగా, నాకు ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేదు. వారికి అదనంగా జీతం రాదని తెలిసింది. అయితే నేను నా జేబులో నుంచి వారికి తగిన మొత్తం చెల్లిస్తాను అని అన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు అంతరిక్షంలో గడిపిన అదనపు సమయానికి ఎలాంటి జీతం పొందరు. నాసా వ్యోమగాములు కూడా యూఎస్ ఫెడరల్ ఉద్యోగులు కావడంతో వారు అంతరిక్షంలో ఎంత కాలం ఉన్నారనే దానితో సంబంధం లేకుండానే.. వారి జీతం వారికి లభించనుంది. అయితే వారి ఆహారం, రవాణా, వసతి వంటి విషయాలను నాసా చూసుకుంటుంది. ఇక 278 రోజులకు నాసా రూ.1,22,980 మాత్రం చెల్లిస్తుంది.
ఇక వ్యోమగాములను సురక్షితంగా తిరిగి భూమి మీదకు తీసుకొని వచ్చినందుకు టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ను ట్రంప్ ప్రశంసించారు. మన దగ్గర ఎలాన్ లేకపోతే వాళ్లు అక్కడ మరి కొన్ని రజులు ఉండేవారు. ఎలాన్ తప్ప వారిని ఇంకెవరు తీసుకొని వస్తారంటూ ట్రంప్ పొగడ్తలు కురిపించారు.