Omar: ప్రజల మద్దతు లేకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయలేము.. ఒమర్ అబ్దుల్లా
ప్రజల మద్దతు లేకుండా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని సీఎం ఒమర్ అబ్దుల్లా నొక్కిచెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజల మద్దతు లేకుండా జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar abdhullah) నొక్కిచెప్పారు. కశ్మీర్‌లో భద్రతా పరిస్థితి శాంతియుతంగా ఉండేలా చూసుకోవడానికి తమ ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నిరంతరం సహాయపడుతుందని తెలిపారు. సోమవారం ఆయన అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శ్రీనర్‌లో మీడియాతో మాట్లాడారు. ‘సెక్యురిటీ మా ప్రత్యక్ష బాధ్యత కానప్పటికీ, ప్రజల మద్దతు లేకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయలేము. కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికైన ప్రభుత్వం పరిస్థితిని అదుపులో ఉంచడానికి, శాంతిని కాపాడటానికి నిరంతరం ప్రయత్నిస్తోంది’ అని చెప్పారు.
కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని సన్యాల్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. గతంలో ఇలాంటివి చాలా జరిగాయని, అనుమానాస్పద కదలికల ఆధారంగా ప్రారంభించిన కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. గత రెండేళ్లుగా జమ్మూ బెల్ట్‌లోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని, రాజౌరి, పూంచ్, ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటివి చూశామని తెలిపారు. శాంతికి విఘాతం కలిగించడమే వారి లక్ష్యమని చెప్పారు.