ఉపాధ్యాయుల పాఠాలు వింటేనే బంగారు భవిష్యత్తు.. రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి

రాష్ట్రంలోని గురుకుల విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంపోందించి, భవిష్యత్ లో రాణించేలా గురుకులాల కార్యదర్శి డా.అలుగు వర్షిణి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Update: 2025-03-24 17:12 GMT
ఉపాధ్యాయుల పాఠాలు వింటేనే బంగారు భవిష్యత్తు.. రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గురుకుల విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంపోందించి, భవిష్యత్ లో రాణించేలా గురుకులాల కార్యదర్శి డా.అలుగు వర్షిణి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రాష్టంలోని గురుకుల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తిత్వ వికాసం ద్వారా జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించుకునేలా విద్యార్థులకు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. దేశంలోనే కాక ప్రపంచంలో ఒక ఉన్నత మార్గదర్శిగా నిలిచిన ప్రముఖులతో విద్యార్థులకు దిశానిర్దేశం చేసే పలు క్రీయాశీలకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే సోమవారం ఇన్ఫోసిస్ అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి తో గురుకుల విద్యార్థులకు జూమ్ మీటింగ్ లో పాల్గొనే అవకాశం కల్పించారు.

ఈ మీటింగ్ లో సుధామూర్తి పలు అంశాలను విద్యార్థులకు చక్కగా వివరించారు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలను క్రమశిక్షణతో జాగ్రత్తగా వింటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆమె తెలిపారు. ముఖ్యంగా చదువు అనేది జీవిత గమనంలో ఒక మార్గం వంటిదని ఆమె అభివర్ణించారు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే వారి తపన ,తాపత్రయం ఉంటుందన్నారు. విద్యార్థి యొక్క జీవిత ప్రయాణం కష్టంగా ఉంటుందని ఒడిదుడుకులను అధిగమిస్తేనే ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఇన్ఫోసిస్ సంస్థ ద్వారా ఎంతోమంది దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగి, రాజ్యసభ సభ్యురాలిగా ఎదిగేందుకు దోహదపడిందని ఆమె వివరించారు.

మెప్పు కోసం ప్రయత్నించొద్దు..

ఎవరికోసమో మెప్పు కోసము వారి ఆనందం కోసం మనం దుస్తులపై అధిక మొత్తంలో ఖర్చు పెట్టడం మంచి పద్ధతి కాదని ఆమె విద్యార్థులకు సూచించారు. అనవసర వాటిపై డబ్బులను అధికంగా ఖర్చు చేయవద్దని విద్యార్థులకు సూచించారు. కష్టపడి పని చేసే తత్వం అలాగే నైపుణ్యం ( స్కిల్ ) ఈ రెండు వుంటే తప్పనిసరి గా ఉద్యోగం అనేది సులభంగా వస్తుందని చెప్పారు. జీవితంలో ఏం సాధించాలన్నా ధైర్యం, ఆత్మస్థైర్యం ఉండాలి. అవి ఉంటేనే విజయం మీ సొంతమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి చదువులపట్ల తొలినుంచి శ్రద్ధ పెంచుకోవాలని, వాయిదాలతత్వం మానుకోవాలని సూచించారు. సమయాన్ని విభజించుకొని ఏ సమయంలో ఏపాఠ్యాంశం చదవాలో చక్కటి ప్రణాళిక తయారు చేసుకోని , వాటిని తూచా తప్పకుండా అమలుపరిస్తే చక్కటి ఫలితాలు సాధిస్తారని చెప్పారు. నిర్లక్ష్యం, అతినిద్ర, ఆకర్షణలకు దూరంగా ఉండాలని , సెల్‌ఫోన్‌కు దూరంగా మెలగాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని నియమాలు పాటించాలని సూచించారు.సులభమైన జ్ఞాపకశక్తి పద్ధతుల ద్వారా విద్యార్థులు విజయాన్ని సాధించగలుగుతారని తెలిపారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు పాఠాలు బోధించే సమయంలో శ్రద్ధగా వినాలని సుధా మూర్తివిద్యార్థులకు దిశా నిర్దేశం చేసారు.

Similar News