వెనుజులా చమురు కొంటే 25 శాతం టారిఫ్
చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న ఈ చర్య సాహసోపేతమైనదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

- ట్రెన్ డి అరగువా ముఠాకు ఆతిథ్యం ఇవ్వడంపై మండిపాటు
- వెనుజులా నుంచి అత్యధికగా చమురు దిగుమతి చేసుకుంటున్న చైనా
- ట్రంప్ మరో కీలక నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వరుసగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా వెనుజులాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న వారికి షాక్ తగిలేలా మరో నిర్ణయం తీసుకున్నారు. వెనుజులా నుంచి చమురు లేదా గ్యాప్ కొనుగోలు చేసే దేశాల దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు ట్రంప్ సోమవారం ప్రకటించారు. వెనుజులాపై కొత్త కొత్త సుంకాలతో పాటు వారితో వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న దేశాలపై కూడా సుంకాలు విధించారు. వెనుజులాతో అమెరికాకు చాలా శత్రుత్వం ఉంది. ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసే వారు ఏప్రిల్ 2 నుంచి అమెరికాకు చేసే వాణిజ్యంపై 25 శాతం సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ట్రెన్ డి అరగువా ముఠాకు వెనుజులా నిలయం కాబట్టి.. వెనుజులా సెకెండరీ సుంకాన్ని ఎందుర్కుంటుందని అన్నారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన ఆ ముఠా సభ్యులుగా చెప్పుకునే వలసదారులను ట్రంప్ ప్రభుత్వం బహిష్కరిస్తోంది. కాగా, ట్రంప్ తాజా సుంకాల వల్ల వెనుజులాకు అతిపెద్ద విదేశీ వినియోగదారుడిగా ఉన్న చైనాకు నష్టం వాటిల్లనుంది.
చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న ఈ చర్య సాహసోపేతమైనదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఫెంటానిల్ అక్రమ వాణిజ్యాన్ని అరికట్టే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ పాలన ఇప్పటికే చైనా దిగుమతులపై 20 శాతం సుంకాలు విధిస్తోంది. వెనుజులా నుంచి ఉత్పత్తి అవుతున్న చమురులో 68 శాతం చైనానే కొనుగోలు చేస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో స్పెయిన్, రష్యా, సింగపూర్, వియత్నాం దేశాలు ఉన్నాయి. మరోవైపు వెనుజులా నుంచి అమెరికా కూడా 8.6 మిలియన్ బ్యారెళ్ల చమురును జనవరిలో కొనుగోల చేసింది.