Delimitation: డీలిమిటేషన్‌ తలలపై వేలాడుతున్న కత్తి.. కేరళ సీఎం విజయన్

డీలిమిటేషన్ అంశంపై న్యాయపోరాటం కొనసాగిస్తామని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు.

Update: 2025-03-22 13:13 GMT
Delimitation: డీలిమిటేషన్‌ తలలపై వేలాడుతున్న కత్తి.. కేరళ సీఎం విజయన్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: డీలిమిటేషన్ అంశంపై న్యాయపోరాటం కొనసాగిస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ (Stalin) స్పష్టం చేశారు. ఈ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యమం డీలిమిటేషన్‌కు వ్యతిరేకం కాదని, కానీ దానిని అన్యాయంగా అమలు చేయడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. డీలిమిటేషన్‌ అంశంపై తమిళనాడు రాజధాని చెన్నయ్‌లో శనివారం నిర్వహించిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘మేము డీలిమిటేషన్‌కు వ్యతిరేకం కాదు. కానీ పారదర్శకతతో కూడిన ప్రక్రియను కోరుకుంటున్నాం. దీనిని అమలు చేయడానికి ఒక చట్టపరమైన వ్యూహాన్ని రూపొందించాలి. అవసరమైతే న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి. హక్కులకు రక్షించడానికి నిరంతరం పోరాడాల్సి ఉంటుంది. పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించకూడదు’ అని తెలిపారు. ఈ విషయంలో ఐక్యంగా ఉండాలని లేదంటే దక్షిణాది గుర్తింపు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగొద్దని సూచించారు. పార్లమెంట్‌లో ప్రజాప్రతినిధుల సంఖ్య తగ్గితే మన అభిప్రాయాలను వ్యక్తపరిచే బలం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అంతేగాక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని, సంస్కృతి, గుర్తింపు దెబ్బతింటుందని తెలిపారు. మన దేశంలోనే మనం రాజకీయంగా బలహీనడపడే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy), పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR), శిరోమణి అకాలీదళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్వీందర్ సింగ్ భుందర్‌ హాజరయ్యారు.

పార్లమెంటు సీట్ల పునర్విభజన అంశం మన తలలపై వేలాడుతున్న కత్తిలాంటిదని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi viijayan) అభివర్ణించారు. ఇది రాజ్యాంగ సూత్రాలకు, ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు లేకుండా డీలిమిటేషన్ ప్రక్రియలోకి అడుగుపెడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే కేరళ సహా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది’ అని తెలిపారు. దక్షిణాదిలో సీట్లు తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగితే బీజేపీకి ప్రయోజనకరంగా ఉంటుందని, ఎందుకంటే వారికి ఆ ప్రాంతంలో పట్టు ఉందని తెలిపారు.

దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నం: డీకే శివకుమార్

పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Shivakumar) ఆరోపించారు. దేశంలో సమాఖ్య వాదం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. బీజేపీ గెలిచే రాష్ట్రాల్లో సీట్లను పెంచాలని, ఓడిపోయే రాష్ట్రాల్లో సీట్లను కుదించాలని కాషాయ పార్టీ కోరుకుంటుందని విమర్శించారు.

25 ఏళ్లు డీలిమిటేషన్ చేయొద్దు: జేఏసీ తీర్మానం

సమావేశంలో డీలిమిటేషన్‌పై జేఏసీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. మరో 25 ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజన వాయిదా వేయాలని తీర్మానంలో పేర్కొంది. ‘జనాభా నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలను ప్రోత్సహించడమే 42, 84,87వ రాజ్యాంగ సవరణల లక్ష్యం. ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. కాబట్టి 1971 జనాభా లెక్కల ఆధారంగా నియోజవర్గాల పునర్విభజనను వాయిదా వేయాలి’ అని పేర్కొంది. పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏవైనా మార్పులు చేయాలంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ఇతర న్యాయ నిపుణుల భాగస్వామ్యంతో ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపింది. ప్రజాస్వాయ్య స్వభావాన్ని మెరుగుపర్చడానికి కేంద్ర ప్రభుత్వం చేసే డీలిమిటేషన్ ప్రక్రియలో స్పష్టత ఉండాలని పేర్కొంది. ఈ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయాలని స్పష్టం చేసింది.

నల్ల జెండాలతో బీజేపీ నిరసన

డీలిమిటేషన్‌పై ఏర్పాటు చేసిన భేటీని వ్యతిరేకిస్తూ తమిళనాడు బీజేపీ నిరసన తెలిపింది. ఆ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ అన్నామలై (Annamalai) మాట్లాడుతూ ‘డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ లాభం కోసం తమిళనాడు ప్రయోజనాలను నిరంతరం విస్మరిస్తోంది. అనేక సమస్యలున్నప్పటికీ సీఎం మాట్లాడటానికి ఎప్పుడూ కేరళ వెళ్లలేదు. కానీ ఒక పనికారిని సమస్యపై మాట్లాడటానికి ఆయనను ఆహ్వానించారు. ఈ సమావేశాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం’ అని తెలిపారు. కేరళ, కర్ణాటకలతో ముల్లై పెరియార్, కావేరీ జలవివాదాలున్నాయని, ఈ అంశాలపై స్టాలిన్ ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రాల ప్రాతినిద్యాన్ని తగ్గించొద్దు: ప్రధానికి వైఎస్ జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డీలిమిటేషన్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ‘లోక్‌సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని తగ్గించొద్దు. ముఖ్యంగా సభలోని మొత్తం సీట్ల సంఖ్య తగ్గని విధంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి’ అని పేర్కొన్నారు. మరోవైపు డీలిమిటేషన్‌పై తదుపరి సమావేశం హైదరాబాద్‌లో జరగనున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News