India china: బీజింగ్‌లో భారత్ చైనా చర్చలు.. కీలక అంశాలపై డిస్కషన్
చైనా రాజధాని బీజింగ్‌లో మంగళవారం భారత్ చైనాలు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: చైనా రాజధాని బీజింగ్‌లో మంగళవారం భారత్ చైనాలు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాయి. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ( WMCC) 33వ సమావేశంలో భాగంగా ఇరు పక్షాలు భేటీ అయినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి నెలకొన్ని ప్రస్తుత పరిస్థితి, సరిహద్దు సహకారం, కైలాష్-మానసరోవర్ తీర్థయాత్ర సహా పలు అంశాలపై డిస్కస్ చేసినట్టు పేర్కొంది. భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ గౌరంగలాల్ దాస్, చైనా ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రిత్వ శాఖలోని సరిహద్దు, సముద్ర వ్యవహారాల విభాగం డైరెక్టర్ జనరల్ హాంగ్ లియాంగ్ నేతృత్వం వహించారు. ఇరు పక్షాల మధ్య సానుకూలమైన వాతావరణంలో చర్చలు జరిగాయని, ఎల్ఏసి వెంట సమస్యలను పరిష్కరించడానికి దౌత్య, సైనిక యంత్రాంగాలను నిర్వహించడానికి, రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలు సహకారాన్ని నిర్ధారించుకోవడానికి ఈ దిశలో చర్యలు తీసుకోవాలని రెండు దేశాలు అంగీకరించినట్టు తెలుస్తోంది.
దీంతో రెండు దేశాల మధ్య ఈ సమావేశం ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు. కాగా, గతేడాది రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ (modi), చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Jinping) సమావేశమైనప్పటి నుండి సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలోనూ మోడీ చైనాపై వ్యాఖ్యలు చేయగా దానిని డ్రాగన్ స్వాగతించింది. దీంతో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం సానుకూల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే చర్యలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.