Colourism: 50 ఏళ్లుగా వర్ణ వివక్ష ఎదుర్కొంటున్నా.. కేరళ సీఎస్ పోస్ట్ వైరల్

భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా వర్ణ వివక్ష బాధితులుగా మారుతున్న విషయం తెలిసిందే. ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు సైతం దీనిని అతీతులు కారు.

Update: 2025-03-26 17:56 GMT
Colourism: 50 ఏళ్లుగా వర్ణ వివక్ష ఎదుర్కొంటున్నా.. కేరళ సీఎస్ పోస్ట్ వైరల్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా వర్ణ వివక్ష బాధితులుగా మారుతున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి మొదలు పెడితే ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు సైతం దీనికి అతీతులు కారు. అయితే వర్ణ వివక్షపై కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ (Sharada muralidaran) చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. సీఎస్‌గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తాను వర్ణ వివక్షకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్లుగా తన చర్మం రంగుపై అవమానకరమైన వ్యాఖ్యలను భరిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘నేనొక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను. ఇటీవలే కేరళ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టా. అంతకుముందు నా భర్త ఇదే స్థానంలో విధులు నిర్వహించారు. దీంతో మా ఇద్దరి కలర్ పై పోలీకలు తెస్తూ కామెంట్స్ వస్తున్నాయి. అదేదో సిగ్గుపడాల్సిన విషయం అన్నట్టు ప్రస్తావిస్తున్నారు. అసలు నలుపును ఎందుకు అవమానించాలి. దానిని ఎందుకు చెడుగా పరిగణించాలి. నలుపు రంగు అనేది విశ్వ సత్యం. అంతేగాక అత్యంత శక్తివంతమైన వనరు. అందరికీ అందంగా కనిపించే రంగు. వర్షం వచ్చే ముందు వాగ్థానం. సాయంత్రానికి సూచిక. ఆ కలర్ లేనిదెక్కడ’ అని పేర్కొన్నారు.

అలాగే తన బాల్యంలోని ఓ ఘటనను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ‘నాలుగేళ్ల వయసులో నేను నా తల్లిని తిరిగి తన గర్భంలోకి చేర్చి, తెల్లగా, అందంగా తిరిగి తీసుకురాగలవా అని అడిగాను. ఆప్పటి నుంచి 50 ఏళ్ల పాటు రంగు ప్రభావం నాపై కనపడింది. నలుపు రంగులో విలువను చూడకపోవడం వల్ల తెల్లటి రంగుకు ఆకర్షితురాలినయ్యా. కానీ నలుపు అద్భుతంగా ఉందని భావించలేకపోయా’ అని తెలిపారు. దీంతో ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ వర్ణ వివక్షపై ఆమె అనునభవాలను పంచుకోవడంపై పలువురు అభినందిస్తున్నారు. మురళీధరన్ పోస్టుపై కేరళ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ స్పందించారు. ఆమె పోస్ట్‌లోని ప్రతి పదం హృదయాన్ని హత్తుకునేలా ఉందని తెలిపారు. తన తల్లి కూడా నల్లగా ఉండేదని, ఈ విషయంపై చర్చించాలని అభిప్రాయపడ్డారు.

కాగా, గతేడాది సెప్టెంబర్‌లో శారద కేరళ సీఎస్‌గా నియామకమయ్యారు. అంతకుముందు ఆమె భర్త ఈ పదవిలో ఉన్నారు. అయితే మురళీధరన్ బాధ్యతలు చేపట్టాక సోషల్ మీడియాలో ఆమె రంగుపై తీవ్ర చర్చ జరిగింది. కానీ వాటిని పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. దీంతో శారద పై విధంగా స్పందించారు.

Tags:    

Similar News